No Confidence Motion Modi Govt: మోడీ సర్కార్ పై విపక్షాలు దూకుడు పెంచాయి. ఏకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. బిజెపికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో 26 పార్టీలు ఏకతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మూడోసారి మోడీ గద్దెనెక్కకూడదని బలంగా నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మణిపూర్ అల్లర్లను బాధ్యత వహిస్తూ మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయినా సరే కేంద్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. దీంతో విపక్ష కూటమి ఇండియా నుంచి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే అనూహ్యంగా కెసిఆర్ నేతృత్వంలోనే టిఆర్ఎస్ సైతం అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడం విశేషం. ఆ పార్టీ విపక్ష కూటమిలో లేకపోయినా స్పందించడం విశేషం.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పై విశ్వాసం లేదంటూ కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లు అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్ సభలో సమర్పించాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగాయి, టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ నోటీసులను అందించారు. వీటిని బుధవారం మధ్యాహ్నం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు.
అయితే ఎన్ డి ఏ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. అటు లోక్ సభ తో పాటు రాజ్యసభలో ఎన్డీఏ పక్షాల మెజారిటీ కొనసాగుతోంది. తాజాగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు దాదాపు 140 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పక్షానికి 332 మంది ఎంపీల మద్దతు కనిపిస్తోంది. ఈ రెండు పక్షాలకు చందని వారు దాదాపు 60 మంది
ఎంపీలు ఉన్నారు. దీంతో ఈ తీర్మానాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగకపోవచ్చు.
అయితే అనూహ్యంగా కేసీఆర్ నేతృత్వంలోని బి.ఆర్.ఎస్ తెరపైకి రావడం విశేషం. కాంగ్రెస్ నేతృత్వంలోనే విపక్ష కూటమి వైపు చూడని కేసీఆర్.. బిజెపికి దగ్గరయ్యారని వార్తలు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ ని ఎదుర్కొనేందుకు బిజెపితో స్నేహం చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో జాతీయస్థాయిలో కేసీఆర్ చరిత్ర మసక బారింది. బిజెపితో టిఆర్ఎస్ కు ఎటువంటి సంబంధాలు లేవని చెప్పుకునేందుకు కేసిఆర్ ఈ సరికొత్త అవిశ్వాస తీర్మానం డ్రామాకుతెర తీశారని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తటస్థంగా ఉన్న పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్న చర్చ కొనసాగుతోంది.