INDIA Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో పొత్తులు కూడా కొలిక్కి వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌తో కలిసిన వాపపక్షాలకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. పొత్తు ధర్మం పాటించకుండా.. లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుపకుండా ఏకపక్షంగా 115 స్థానాలకు టికెట్లు ప్రకటించారు. దీంతో వామపక్షాలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటున్నాయి.
కాంగ్రెస్‌తో చర్చలు..
జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, మామపక్షాలు ఉన్నాయి. అదే కూటమిని తెలంగాణ ఎన్నికల బరిలో పోటీలో నిలపాలన్న ప్రతిపాదన వామపక్షాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తమకు కేటాయించే సీట్లపై కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. ఖమ్మం కొత్తగూడెం, భద్రాచలం, బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తులతో బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతోంది.
ఇండియా కూటమిగా..
ఇండియా కూటమిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తే.. యూపీఏ ఇండియా గా మారిన తర్వాత ఎదర్కొనే తొలి ఎన్నికలు తెలంగాణవే అవుతాయి. ఈమేరకు పొత్తులు కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. వామపక్షాలు కూడా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం లేదు. బీఆర్‌ఎస్, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేసి సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం తెలిపారు.
సీట్ల కేటాయింపుపైనే ట్విస్ట్..
అయితే వామపక్షాలు అడుగుతున్న సీట్లలో కాంగ్రెస్‌లోనూ బలమైన అభ్యర్థులే ఉన్నారు. ఇప్పటికే వారు ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హుస్నాబాద్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రభాకర్ పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం, బెల్లంపల్లి, మునుగోడులోనూ పలువురు నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వామపక్షాలకు సీట్ల కేటాయింపు అంశంపై సందిగ్ధం నెలకొంది. టీపీసీసీ సొంత పార్టీ నేతలను సర్ధిచెబుతుందా.. లేక వేరేస్థానాలు సూచిస్తుందా.. అనిది తెలియడం లేదు. వేరేస్థానాలు సూచిస్తే. అందుకు లెఫ్ట్ పార్టీలు అంగీకరిస్తాయా అన్నది అనుమానమే.
అన్నీ అనుకున్నట్లు జరిగి పొత్తు కుదిరితే.. ఇండియా కూటమిగానే బరిలోకి దిగాలని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ సక్సెస్ అయితే.. దాని ఫలితం 2024లో లోక్‌సభ ఎన్నికలపైనా ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.