Independence Day 2024: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచింది. ఏటా మన స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటి నుంచి కేంద్రం వేడుకలకు మరింత వైభంగా నిర్వహిస్తోంది. హర్ ఘర్ తిరంగా పేరిట వారం రోజుల ముందు నుంచే వేడుకలు నిర్వహిస్తోంది. 75వ స్వాంతంత్య్ర దినోవ్సవం సందర్భంగా ఇంటింటికీ ఉచితంగా జాతీయ పతాకాలను కూడా పంపిణీ చేసింది. ఆగస్టు 15న 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా దేశమంతా త్రివర్ణ పతాకాలతో అలంకరించనున్నారు. ఇక ఇదే రోజు మనతోపాటు ప్రపచంలో కొన్ని దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్నాయి. భారత్‌లోపాటు ప్రపంచంలో మరే దేశాలు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాయో తెలుసుకుందాం.
దక్షిణ కొరియా..
ఆగస్టు 15 రెండు కొరియాలకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజును కొరియా జాతీయ విముక్తి దినం అంటారు. ఈ రోజున, వారు జపాన్ యొక్క 35 సంవత్సరాల వలస పాలన నుంచి విముక్తి పొందిన తరువాత స్వాతంత్య్రం పొందారు. కొరియన్ ప్రజలు 1945లో స్వతంత్రులయ్యారు.
ఉత్తర కొరియా..
రెండు కొరియా దేశాల మధ్య యుద్ధం కారణంగా విడిపోయినప్పటికీ, అవి తమకు స్వాతంత్య్రం వచ్చిన రోజును మాత్రం ఇప్పటికీ ఒకేరోజున నిర్వహించుకుంటాయి. అందువల్ల, ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ముళ్ల కంచె ఉన్నప్పటికీ, రెండు దేశాల స్వాతంత్య్ర దినోత్సవం మాత్రం ఆగస్టు 15.
బహ్రెయిన్..
భారత దేశం లాగానే బహ్రెయిన్ కూడా బ్రిటిష్ పాలనలో ఉంది. ఈ దేశం 1971లో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది ఈ గల్ఫ్ దేశం. ఈ దేశంలో మినరల్ ఆయిల్‌ను కనుగొని శుద్ధి చేయడం ప్రారంభించింది. ఇది 1931లో ప్రారంభమైంది. 1971 ఆగస్టు 14న వారికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
రిపబ్లిక్ ఆఫ్ కాంగో..
కాంగో ఫ్రాన్స్ నుంచి 1960లో స్వాతంత్య్రం పొందింది. రిపబ్లిక ఆఫ్ కాంగోగా ఏర్పడింది. దీంతో స్వాతంత్య్రం పొందిన ఆగస్తు 15న ఈ దేశం కూడా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంది.
లీచ్‌టెన్‌స్టెయిన్..
లీచ్‌టెన్‌స్టెయిన్ ప్రపంచంలోని ఆరవ అతి చిన్న దేశం. ఈ దేశం 1866, ఆగస్టు 15న జర్మనీ నుంచి స్వాతంత్య్రం పొందింది. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంది. వేడుకల్లో భాగంగా దేశమంతా బాణాసంచా కాల్చుతూ.. ఇండిపెండెన్స్ డే ఘనంగా చేసుకుంటారు.
ఇలా భారత దేశంతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఆరు దేశాలు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్రం పొందిన తర్వాత మన నుంచి విడిపోయిన పాకిస్తాన్ మాత్రం ఒకరోజు ముందే.. అంటే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంది.