Independence Day 2024: దేశంలో 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరూరా, వాడ వాడలా జాతీయ పతాకాలు రెపరెపాడుతున్నాయి. మోదీ వరుసగా 11వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లిన మోదీ జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా దేశాన్ని తీర్చిదిద్దుతామన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని పేర్కొన్నారు. దేశం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణాలు పణంగా పెట్టారని పేర్కొన్నారు. భారత దేశ ప్రస్తానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు. తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా చేయాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ మన అందరి లక్ష్యమని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 నినాదం 140 కోట్ల మంది భారతీయుల కలల తీర్మానం అన్నారు. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికిభారత్ ఎదగాలని ఆకాంక్షించారు.
న్యాయ సంస్కరణలు అవసరం..
ఇదిలా ఉంటే.. ఎర్రకోటవేదికగా మోదీ న్యాయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల నిర్ణాయాలను తప్పు పడుతున్న కోర్టులు, వారికి వారే తీర్పు ఇచ్చుకుంటున్న తీరు కొనసాగుతున్న నేపథ్యంలోమోదీ న్యాయ సంస్కరణలు అవసరమన్నారు. ప్రభుత్వ నియామకాలు, నిర్ణయాలను ప్రశ్నిస్తున్న న్యాయస్థానాలు ఇందుకు రాజ్యాంగం సాకుగా చూపుతున్నాయి. అదే న్యాయమూర్తుల నియామకానికి వచ్చే సరికి వారికివారే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోలీజియంకే రాజ్యాంగబద్ధత లేదన్న విషయాన్ని విస్మరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సంస్కరణల అంశం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత చట్టాలను కేంద్రం మార్చింది. కొత్త న్యాయ సంహితను అమలు చేస్తున్నారు. తాజాగా న్యాయ వ్యవస్థలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మోదీ సంకేతం ఇచ్చారు.
మెజారిటీ లేకపోయినా..
వరుసగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మోదీ ప్రధాని అయ్యారు. అయితే గత రెండు పర్యాయాలతో పోలిస్తే.. ఈసారి బీజేపీ బలం తగ్గింది. ఎన్డీఏలోని పార్టీల మద్దతులో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ, తాను చేయాలనుకున్నది చేసి తీరుతామన్న సంకేతం ఇచ్చారు మోదీ. దేశానికి అవసరమైన సంస్కరణల విషయంలో వెనక్కితగ్గేదే లేదు అన్నట్లుగా దూసుకుపోతున్నారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం..
ఎర్రకోట వేదికగా మోదీ న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా న్యాయ శాఖలో ఉన్నవారు దీనిపై చర్చిస్తున్నారు. కేంద్రం తెచ్చే సంస్కరణలు ఎలా ఉంటాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని చర్చించుకుంటున్నారు. సంస్కరణల ప్రభావం న్యాయ వ్యవస్థపై ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కొందరు మోదీ వ్యాఖ్యల వెనుక నిగూఢ అర్థం ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నారు. మొత్తంగా 78వ స్వాతంత్ర వేడుకల వేళ మోదీ సంచలన నిర్ణయంతో కొత్త చర్చకు తెరతీశారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More