YCP MLAs Party Change : వైసీపీని వీడేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా? ఐదుగురు నుంచి 8 మంది వరకు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఈ వార్తల్లో నిజం ఎంత? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయంగా పెను దుమారం రేపింది. అధికార విపక్షాల మధ్య గట్టి వాదనలే జరుగుతున్నాయి. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి టిడిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు.ఈ క్రమంలో సీనియర్ మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గేట్లు తెలిస్తే వైసీపీలో ఎమ్మెల్యేలు మిగలరని.. ఐదుగురు నుంచి 8 మంది వరకు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారంతా టిడిపికి టచ్ లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కేవలం 11 స్థానాలే. జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. ఈ నలుగురే యాక్టివ్ గా ఉన్న నేతలు. పార్టీతో పాటు జగన్ అన్న విధేయత చూపేది ఈ ముగ్గురే. మిగతావారు అనామకులు. వారికి విధేయతతో అంత పని లేదు. అయితే ఇప్పటికిప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరే ఉద్దేశంలో ఉన్నారా? కూటమిలో చేర్చుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా? అంటే మాత్రం సమాధానం దొరకని పరిస్థితి.
* కూటమి కిటకిట
కూటమి తరుపున 164 మంది గెలిచారు. ఒక్క టిడిపి తరఫున 135 మంది విజయం సాధించారు. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలతో కిటకిటలాడుతోంది. వారికి నిధులు, విధులు సర్దుబాటు చేయడంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నాయి. మూడు పార్టీల మధ్య సమన్వయం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటారా? అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఆ స్థాయిలో సానుకూలత కూడా కనిపించడం లేదు. టిడిపి కూటమి నుంచి ప్రయత్నాలు కూడా జరగడం లేదు.
* ఏం లాభం
శాసనసభలో అసలు వైసీపీ ఉనికి లేదు. ఈ సమయంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే ఏం చేస్తారు అన్న ప్రశ్న ఎదురవుతోంది. అయితే వైసీపీని గట్టిగా దెబ్బ తీయాలంటే ఆ పని చేయాలి. కానీ 2014లో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు చంద్రబాబు. దానిపై విమర్శిస్తూనే జగన్ టిడిపికి చెందిన నలుగురిని లాగేసుకున్నారు. అప్పటికే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నలుగురు అవసరం లేకున్నా జగన్ టిడిపిని దెబ్బ తీయాలని భావించారు. కానీ అదే ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకునే సాహసం చేస్తారా?అన్నది చూడాలి.
* ప్రస్తుతానికి ఛాన్స్ లేదు
వైసీపీలో నమ్మకమైన ఎమ్మెల్యేలు ఆ నలుగురే ఉన్నారు. మిగతావారు వివిధ కారణాలతో గెలిచారు. ఇప్పటివరకు అయితే వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. జగన్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన వెంట నడవాలని భావిస్తున్నారు. అయితే వైసిపికి భవిష్యత్తు లేదని భావిస్తే మాత్రం వారు స్వచ్ఛందంగా కూటమి పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే చంద్రబాబు నుంచి వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే 164 మంది బలం ఉండడం.. కూటమి కిటకిటలాడుతుండడంతో.. వైసీపీ నుంచి తీసుకుని ఏం చేస్తాంలే అన్న భావన టిడిపిలో ఉంది. పైగా ఎటువంటి చెడ్డపేరుకు అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సీనియర్ మంత్రి అలా ప్రకటన చేసేసరికి మాత్రం రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More