ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రజలు నిరాశకు గురయ్యారు. అప్రతిహసంగా అన్ని మ్యాచులు గెలిచిన భారత్.. ఫైనల్ ముంగిట చతికిల పడింది. అయితే మ్యాచ్ పోయింది కానీ.. రాజకీయంగా మాత్రం చాలామందికి వర్కౌట్ అయ్యింది. హై టెన్షన్ మ్యాచ్ కావడంతో.. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ స్క్రీన్ లను ఏర్పాటు చేశాయి. క్రీడాభిమానుల వీక్షణకు అవకాశం కల్పించాయి. అయితే చాలా చోట్ల రాజకీయ ప్రకటనలు ఇప్పించుకోవడం విశేషం.
ఏపీలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ విధంగానే వ్యవహరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పెద్దపెద్ద స్టేడియాల్లో బిగ్ స్క్రీన్ లను ఏర్పాటు చేసి ఫైనల్ మ్యాచ్ ను ప్రసారం చేసింది. క్రీడాభిమానులకు ఉచితంగా వీక్షించే అవకాశాన్ని కల్పించింది. వీటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడికక్కడే సహకరించారు. అయితే ఈ ప్రసారం.. రాజకీయ ప్రచారంగా మారిపోయింది.
మ్యాచ్ విరామ సమయంలో అడ్వర్టైజ్మెంట్స్ మాదిరిగా సీఎం జగన్ వీడియోలను ప్రదర్శించింది. సీఎం జగన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లోగోను ఆవిష్కరిస్తున్నట్లు ఉన్న చిత్రాలను స్క్రీన్లపై వేసింది. మ్యాచ్ జరుగుతుండగానే పలుమార్లు జగన్ ఉన్న వీడియోలు ప్రసారమయ్యాయి. అయితే ఆయన పక్కన ఏసి ఏ అధ్యక్షుడు హోదాలో ఢిల్లీ మద్యం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శరత్ చంద్రారెడ్డి, మంత్రి రోజా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ సి ఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి కనిపించడం విశేషం. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా రాజకీయ ప్రచారం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.