Homeజాతీయ వార్తలుస్టాలిన్‌ను టైం చూసి కొడుతున్న బీజేపీ

స్టాలిన్‌ను టైం చూసి కొడుతున్న బీజేపీ

Stalin Daughter
మరికొద్ది రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఆదివారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. అయితే.. పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొలదీ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ నివాసంలో ఆదాయ పన్నుశాఖ శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. నీలంగరాయ్‌లోని శబరీశన్‌ నివాసంతో పాటు చెన్నైలో ఆయనకు సంబంధించిన మరో మూడు కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఐటీ దాడుల గురించి తెలుసుకున్న డీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులు శబరీశన్ నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. స్టాలిన్ ఎన్నికల కోర్ కమిటీలో శబరీశన్ కీలక వ్యూహకర్తగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఆస్తులు ఒక్కసారిగా ఎలా పెరిగాయని స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రశ్నించిన మర్నాడే శబరీశన్ నివాసంలో దాడులు జరగడం గమనార్హం. కోయంబత్తూరు సమీపంలోని గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే నేతల నివాసాల్లో ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి.

గత నెల ఆ పార్టీ సీనియర్‌ నేత ఈవీ వేలు నివాసంలో ఆదాయ పన్ను అధికారులు మెరుపు దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. వేలు నివాసం సహా ఆయన కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మొత్తం 10 చోట్ల సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో నగదు ప్రవాహం జరగుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో వేలు నివాసంలో భారీ మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులకు ఉసిగొల్పుతున్నారని డీఎంకే ఆరోపిస్తోంది.

ఎక్కడా నగదు దొరకకున్నా.. నగదు తమ దగ్గర లేకున్నా ఉద్దేశపూర్వకంగానే సోదాలు నిర్వహిస్తున్నారని.. ఈ చర్యలు తమ విజయాన్ని అడ్డుకోలేవని డీఎంకే జనరల్ సెక్రెటరీ దురైమురుగన్ స్పష్టం చేశారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 6న ఓకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న వెల్లడికానున్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. కాంగ్రెస్‌, వాపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో కూటమిగా ఏర్పడి ప్రచారంలో దూసుకెళుతోంది. స్టాలిన్‌ కొలతూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular