Janasena vs Posani : నటుడు, రచయిత, ఇటీవల ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితుడైన పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదైంది. జనసేన అధ్యక్షుడు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.రాజమండ్రిలో యందవ ఇందిరా అనే జనసేన నాయకురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఐసీపీ 354, 355, 500, 504, 506,507,509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కొద్దిరోజుల కిందట పవన్ పై పోసాని తీవ్రస్థాయిలో రియాక్టు అయిన సంగతి తెలిసిందే. పవన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పోసాని కామెంట్స్ చేయడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు అదే స్థాయిలో రియాక్టు అయ్యారు. పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. కానీ ఎక్కడా పోలీసులు కేసు నమోదుచేయలేదు. రాజమండ్రిలో కూడా ఇందిర ఫిర్యాదుచేశారు. కానీ పోలీసులు స్పందించకపోవడంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదుచేయడం తప్పనిసరిగా మారింది. పోసాని కృష్ణమురళి విషయంలో జనసేన నాయకులు పంతం నెగ్గించుకున్నట్టయ్యింది.

సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇటీవలే పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ చైర్మన్ గా నియమించారు. గత కొన్నేళ్లుగా పోసాని వైసీపీ సానుభూతిపరుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి బాహటంగా మద్దతు తెలిపి ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పదవి తప్పదని భావించారు. కానీ మూడున్నరేళ్ల తరువాత జగన్ నామినేట్ పదవి కేటాయించారు. అయితే ఇదంతా పవన్ మహత్యమేనన్న టాక్ నడుస్తోంది. పవన్ ను విమర్శించే బాధ్యతను సినిమా ఇండస్ట్రీకి చెందిన పోసానికి అప్పగించారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల విమర్శల జడివానను పెంచడంతో జగన్ స్పందించి పదవి ఇచ్చారని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తోంది.
ఆది నుంచి పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో పోసాని ముందుండేవారు. అదే వైసీపీతో పాటు జగన్ దగ్గర గుర్తింపునకు కారణమన్న ప్రచారం అయితే ఉంది. కొద్దిరోజుల కిందట వైసీపీ నేతల తీరుపై పవన్ విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ప్రశ్నలను సంధించారు. అయితే ఇందులో ఏ మాత్రం సంబంధ: లేని పోసాని మాత్రం స్థాయికి మించి రియాక్టు అయ్యారు. పవన్ కుటుంబసభ్యులపై కూడా తిట్ల దండకానికి దిగారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అటు ఇండస్ట్రీలో సైతం పోసాని వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే మెగా అభిమానుల రియాక్షన్ చూసిన పోసాని కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. ఏపీ సర్కారు నామినేట్ పదవి కేటాయించడంతో తిరిగి రియాక్టయ్యారు. ఇంతలోనే కోర్టు ఆదేశాలతో రాజమండ్రి పోలీసులు కేసు నమోదుచేశారు.
అయితే పోసాని విషయంలో జన సైనికుల పంతం ఫలించింది. పోసాని వెనుక అధికార పార్టీ ఉంది. దీంతో తమ అభిమాన నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏం చేయలేకపోయామన్న బాధ జన సైనికుల్లో ఉంది. పోలీస్ స్టేషన్ కు వెళ్తే అసలు ఫిర్యాదుకాపీని తీసుకోడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. చివరకు న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో తమ పంతాన్ని నెగ్గించుకునే సువర్ణ అవకాశం జన సైనికులకు వచ్చింది. కాకినాడలో మడ అడవులను సంరక్షణకు జాతీయ హరిత ట్రైబ్యునల్ కు వెళ్లి జన సైనికులు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్లు జరిమానా విధించగలిగారు. అది మరువక ముందే పోసానిపై కేసు నమోదు కావడంతో జన సైనికులు తెగ ఆనందపడుతున్నారు.