ABN Andhra Jyothi: ఎన్నికలకు ముందు ఓటుకు ఇంత అని చొప్పున పంచడం..అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం.. తరతరాలకు దాచుకోవడం.. అడ్డొచ్చిన వాడిని అణచివేయడం.. ఎవరైనా బిల్డింగ్ కడుతున్నారు అంటే అడ్డుకోవడం.. వారి వాటా వసూలు చేసుకోవడం.. ఇలానే సాగుతోంది హైదరాబాదులో కార్పొరేటర్ల వ్యవహారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో ఎన్నడు లేనివిధంగా అవినీతి అనేది విశృంఖళంగా సాగిపోతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా కార్పొరేటర్లు దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. 100 గజాలకు మించిన స్థలంలో ఇల్లు నిర్మిస్తుంటే తమ వాటా ఏది అంటూ దౌర్జన్యంగా డిమాండ్ చేసి మరి తీసుకెళ్తున్నారు. అయితే హైదరాబాదులో కార్పొరేటర్ల వ్యవహార శైలిపై అధికార పార్టీకి కొమ్ముకాసే మీడియా నిశ్శబ్దంగా ఉండగా.. న్యూట్రాలిటీగా ఉండే మీడియా కూడా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో కార్పొరేటర్ల దౌర్జన్యకాండ పై ఆంధ్రజ్యోతి చాలా అద్భుతమైన కథనాలు ప్రచురిస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీ కార్పొరేటర్లు, ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు ఎలా వసూళ్లకు పాల్పడుతున్నారో ఉదాహరణలతో సహా కథనాలు ప్రచురించింది. ఎన్నికల సమయం కావడం తో ఇది అధికార పార్టీకి ప్రతిబంధకంగా మారింది. ఏ కార్పొరేటర్లు అయితే వసూళ్లకు పాల్పడుతున్నారో .. వారికి భారత రాష్ట్ర సమితి పెద్దలు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. వ్యవహార శైలి మార్చుకోకపోతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల కార్పొరేటర్లు అందులోనూ అధికార పార్టీకి చెందినవారు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న తీరు కూడా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ప్రభుత్వం పై మొట్టికాయలు వేయడంతో అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. సరిగా ఈ సంఘటనలను ఉదహరిస్తూ ఏకంగా ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికార పార్టీలో ఎన్నికల ముందు ఆందోళన స్టార్ట్ అయింది.
ఇక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో నిర్మాణరంగం ఇటీవల జోరందుకుంది. పెద్ద పెద్ద బిల్డర్లకు ప్రభుత్వ అధినేతలతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్లు వారి జోలికి వెళ్లడం లేదు. అదే మధ్య తరగతి బిల్డర్లు, కింది స్థాయి బిల్డర్ల జోలికి మాత్రం కార్పొరేటర్లు వెళ్తున్నారు. కేవలం కార్పొరేటర్లు మాత్రమే కాదు ఆ మధ్య మంత్రి మల్లారెడ్డి సైతం ఓ బిల్డర్ కు తన వాటా ఇవ్వలేదని ఎలా దంకీ ఇచ్చాడో అందరికీ విధితమే.. సో ఇవన్నీ అధికార పార్టీలో దర్జాగా సాగిపోతున్నాయి. ఇప్పుడంటే కేసీఆర్ తో పడడం లేదు కాబట్టి ఆంధ్రజ్యోతి రాస్తోంది. ఒకవేళ అన్ని బాగుంటే ఇలా రాసేదా?! తెలంగాణలో అగ్ని చిమ్ముతున్న ఆంధ్రజ్యోతి.. గతంలో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ ఎమ్మెల్యే ఇసుక వ్యవహారంలో మండల రెవెన్యూ అధికారిని ఎలా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు. కానీ ఆ వార్తను ఆంధ్రజ్యోతి దాచిపెట్టింది. ప్రచురించకుండా తన పచ్చ భక్తిని ప్రదర్శించింది. అంటే రెండు రాష్ట్రాలు.. రెండు జర్నలిజాలు… అచ్చం రెండుకళ్ల సిద్ధాంతం లాగా..