Tollywood Heroes: ప్రచారం ముద్దు.. ప్రశ్నలు అడగవద్దు.. ఇదీ మన టాలీవుడ్ హీరోల వరస!

ప్రింట్ మీడియా ఎలాగూ ప్రశ్నలు అడగదు. ఒకవేళ ప్రశ్నలు అడిగినప్పటికీ అవి ప్రచురించే సమయానికి రకరకాల ఆబ్లిగేషన్లు తెరపైకి వస్తుంటాయి. ఆ మీడియా మేనేజ్మెంట్ మనకెందుకు వచ్చిన గొడవ అంటూ వాటిని పబ్లిక్ చేయడం మానేస్తుంది.

Written By: K.R, Updated On : October 17, 2023 6:02 pm

Tollywood Heroes

Follow us on

Tollywood Heroes: ప్రింట్ మీడియాలో ప్రచారం కావాలి. డిజిటల్ మీడియాలో ప్రచారం కావాలి. విజువల్ మీడియాలో సైతం ప్రచారం మాత్రమే కావాలి. స్తుతి కీర్తనలు ఆలపించాలి. భుజ కీర్తులు మాత్రమే తొడగాలి. అంతే తప్ప ప్రశ్నలు అడగకూడదు. వరుసగా పది సినిమాలు ఫ్లాప్ అయి, బయ్యర్లు నిండా మునిగి, నిర్మాతలు సంక నాకు పోయినప్పటికీ హీరోలను ఏమీ అనకూడదు. మీడియా అనేది ప్రశ్నించకూడదు. అడ్డదిడ్డంగా సినిమా ఉన్నప్పటికీ, కథ, కథనం వంటివి గాలికి కొట్టుకుపోయే పేలపిండి అయినప్పటికీ పట్టించుకోకూడదు. జస్ట్ హీరోను పొగుడుతూ ప్రశ్నలు అడగాలి. మీరు ఇంత అందంగా ఎలా ఉంటారు? ఇంత వయసుకు వచ్చినా కూడా అంతా చార్మింగ్ లా ఎలా కనిపిస్తున్నారు? మీరు ఏం తింటారు? ఎన్ని గంటలకు లేస్తారు? ఎలాంటి నీళ్లు తాగుతారు? హాలిడేస్ కు ఏ ఏ దేశాలకు వెళ్తారు? మీ పిల్లలకు మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? అనే ముఖస్తుతి ప్రశ్నలు తప్ప.. నెగిటివ్ ప్రశ్నలను టాలీవుడ్ హీరోలు కోరుకోవడం లేదు.

ప్రింట్ మీడియా ఎలాగూ ప్రశ్నలు అడగదు. ఒకవేళ ప్రశ్నలు అడిగినప్పటికీ అవి ప్రచురించే సమయానికి రకరకాల ఆబ్లిగేషన్లు తెరపైకి వస్తుంటాయి. ఆ మీడియా మేనేజ్మెంట్ మనకెందుకు వచ్చిన గొడవ అంటూ వాటిని పబ్లిక్ చేయడం మానేస్తుంది. ఇక ఎలక్ట్రానిక్ మీడియా అయితే అది ఒక కలగూరగంప. ఎటువంటి ప్రశ్నలు వేయాలో ముందుగా హీరోల నుంచి ఆదేశాలు వస్తాయి. కాబట్టి అక్కడ నుంచి కూడా నెగిటివ్ ప్రశ్నలు ఉండవు. యూట్యూబ్ ఛానల్ అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలాది చానల్స్ ఉన్నాయి కాబట్టి..ఏవీ కూడా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. వాటిని మన హీరోలు పెద్దగా లెక్కలోకి తీసుకోరు. దీనివల్ల ఇంటర్వ్యూలు అంటే ఒక ప్రమోషనల్ ఈవెంట్ లాగానే అయిపోతుంది. ఆ ఈవెంట్లో కేవలం ముఖస్తుతి ప్రశ్నలు మాత్రమే అడగడం వల్ల అసలు విషయం ప్రేక్షకులకు తెలియడం లేదు.

బాలీవుడ్ లో అయితే ఇలా ఉండదు. అక్కడ నటినటులు నెగటివ్ ప్రశ్నలు కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కోలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. ఇక మాలివుడ్ లో అయితే అక్కడి నటీనటులకు ఏమాత్రం హిపోక్రసీ ఉండదు. అక్కడిదాకా ఎందుకు ప్రస్తుతం యానిమల్ అనే సినిమా రూపొందుతోంది కదా.. అందులో రస్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రణబీర్ కపూర్ తో లిప్ లాక్ సీన్ గురించి బాలీవుడ్ మీడియా నేరుగానే అడిగేసింది. దీంతో మొదట రష్మిక ఇబ్బంది పడినప్పటికీ.. తర్వాత ఆ ముద్దు సన్నివేశానికి సంబంధించి నేపథ్యాన్ని వివరించింది. ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే హీరోలు వాళ్ళ ఫ్లాప్ సినిమాల గురించి అడగవద్దని ముందే విలేకరులకు చెబుతున్నారు. కేవలం హిట్ సినిమాలకు సంబంధించిన ప్రస్తావన మాత్రమే తీసుకురావాలని సూచిస్తున్నారు. (అప్పుడప్పుడు సంతోషం సురేష్ లాంటివారు నెత్తి మాసిన ప్రశ్నలు అడుగుతున్నారు అది వేరే విషయం) అంతేకాకుండా తమ సినిమా ప్రమోషన్ల కోసం సినిమా జర్నలిస్టులను ప్రాంక్ చేసే ఇంటర్వ్యూలు కూడా హీరోలు ప్లాన్ చేస్తున్నారు. రంగ బలి అనే సినిమాకు హీరో నాగ శౌర్య కమెడియన్ సత్యతో ఇలానే చేశాడు. సినిమా మీద బజ్ క్రియేట్ చేశాడు. ఆ సినిమాలో విషయం లేకపోవడంతో అడ్డంగా ఎదురు తన్నింది. అక్కడిదాకా ఎందుకు ఇటీవల మ్యాడ్ అనే సినిమాలో కనిపించిన దర్శకుడు అనుదీప్ ను.. కొండేటి సురేష్ కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో మీ గత సినిమా ప్రిన్స్ ఫ్లాఫ్ అయింది కదా.. ఆ సినిమా ఫ్లాప్ కావడం వల్లే మీరు మ్యాడ్ సినిమాలో నటిస్తున్నారా అని అడిగితే.. దానికి అనుదీప్ నొచ్చుకున్నాడు. తర్వాత ప్రశ్న అడగకుండా సురేష్ ను దాటవేశాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. స్థూలంగా చెప్పాలంటే మన టాలీవుడ్ నటీనటులకు కేవలం ప్రచారం మాత్రమే కావాలి. ప్రశ్నలు అస్సలు వద్దు.