Telangana Congress: తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏపీలో చంద్రబాబు అరెస్టు పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం చూస్తోంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక బిజెపి హస్తం ఉందన్న ప్రచారం ఉంది. అటు జగన్కు కేసిఆర్ అత్యంత సన్నిహితుడు కావడం..గత కొన్ని రోజులుగా కెసిఆర్ ను కమ్మ సామాజిక వర్గం వ్యతిరేకిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ సైతం కమ్మ సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి నేతలను పార్టీలోకి రప్పించి టికెట్లను కట్టబెట్టింది.
హైదరాబాద్ నగరం తో పాటు ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం అధికం. అక్కడ గెలుపు ఓటములను నిర్దేశించే స్థితిలో కమ్మ సామాజిక వర్గం ఉంది. అందుకే తమ వర్గానికి పది నియోజకవర్గాల కేటాయించాలని సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి హై కమాండ్ ను కోరారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల క్రమంలో కమ్మ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ నాయకత్వం సైతం క్రమ సామాజిక వర్గం నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో పని చేసిన నాయకులకు పార్టీలోకి ఆహ్వానించి టిక్కెట్లు ఇస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మండవ వెంకటేశ్వరరావును చేర్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎక్కడ టిక్కెట్ ఇవ్వాలన్నది మాత్రం తేల్చుకోలేక పోతుంది. నిజామాబాద్ రూరల్ ఇవ్వాలనుకున్న అక్కడ ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారు. పైగా సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం కూడా ఇవ్వడానికి వీలు లేదు. ఈ తరుణంలో ఆయనను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి నియోజకవర్గం కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ సెటిలర్స్ తోపాటు కమ్మ సామాజిక వర్గం అధికం. సరైన అభ్యర్థి లేకపోవడంతో కాంగ్రెస్ హై కమాండ్ మండవ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే ఎక్కడికక్కడే అంతర్గత సర్వేలతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు ఉండడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఏపీ రాజకీయాల పుణ్యమా అని కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుండడం విశేషం.