Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పొమ్మనలేక పొగ పెడుతున్నారు. ఆయన ఏ సమయంలో వెళ్ళిన జగన్ అపాయింట్మెంట్ ఇట్టే లభించేది. కానీ ఆయనను వ్యూహాత్మకంగా దూరం పెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తన సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన ఆయన.. సీఎం జగన్ ను కలిసేందుకు తాడేపల్లి వెళ్లారు. కానీ సీఎం జగన్ నేరుగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం విశేషం. ముందుగా సీఎం వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డితో భేటీ కావాలని సీఎం ఆదేశాలు ఇవ్వడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ నేరుగా సీఎం జగన్ను కలిసే చనువున్న తనను ఘోరంగా అవమానించారని వాపోతున్నారు.
ప్రకాశం జిల్లాలో బాలినేని పట్టున్న నాయకుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్కు సమీప బంధువు కూడా. అందుకే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న బాహటంగా నాడు జగన్కు మద్దతు తెలిపారు. జగన్ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నారు. జగన్కు అత్యంత సన్నిహిత నేతల్లో ఈయన ఒకరు. అందుకే తన తొలి మంత్రివర్గంలోనే బాలినేనికి జగన్ అవకాశమిచ్చారు. కానీ మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఉద్వాసన పలికారు. అయితే తాను కాంగ్రెస్ లో వదులుకున్న మంత్రి పదవి సమయాన్నైనా.. తనకు జగన్ మంత్రి పదవిలో ఉంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. తనను తప్పించి.. ప్రకాశం జిల్లాలో మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ని కొనసాగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అడుగడుగునా ఎదురవుతున్న అవమానాలను భరించలేక అసంతృప్తిని బాహటంగానే వెళ్ళగక్కుతూ వచ్చారు. అయితే ఇలా అసంతృప్తి వ్యక్తం చేసే సమయంలో జగన్ పిలిపించి మాట్లాడేవారు. బుజ్జగించేవారు. ఈసారి మాత్రం పట్టించుకోవడం మానేశారు.
వాసన్న అని ముద్దుగా జగన్ బాలినేనిని పిలిచేవారు. దీంతో బాలినేని మురిసిపోయేవారు. గత నాలుగున్నర ఏళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తే నేరుగా సీఎం జగన్ కలిసే చనువు బాలినేనికి ఉంది. గతంలో మంత్రిగా తప్పించినప్పుడు, రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసినప్పుడు బాలినేని స్వయంగా జగన్ పిలిపించి మాట్లాడేవారు. కానీ ఈసారి జగన్ పిలవలేదట. బాలి నేనే తనంతట తానుగా కలిసి సెక్యూరిటీ సరెండర్ చేయడానికి గల కారణాలను జగన్కు వివరించాలని భావించారట. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ జలక్ ఇచ్చారు. తనతో కాదు ముందుగా తన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డితో మాట్లాడాలని చెప్పడంతో బాలినేని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గతంలో కొంతమంది నాయకుల విషయంలో జగన్ ఇదే విధంగా వ్యవహరించారు. తాను నేరుగా మాట్లాడడానికి ఇష్టపడక పోతే .. అది తప్పకుండా వదులుకునేందుకు సిద్ధపడినట్టేనని సంకేతాలు ఇస్తారని వైసీపీలో ఒక ప్రచారం ఉంది. ఈ లెక్కన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వదులుకునేందుకు సీఎం జగన్ దాదాపు సిద్ధపడినట్లు సమాచారం.
ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏమంత బాగాలేదు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మంచి పనితీరు కనబరుస్తోంది. వైసీపీలో చూస్తే నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీనికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కారణమని వైసిపి హై కమాండ్ కు నివేదికలు వెళ్లాయి. తనకు మంత్రి పదవి పోయిన నాటి నుంచి బాలినేని అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారని జగన్కు ఫిర్యాదులు అందాయి. ఇతర నియోజకవర్గాల్లో సైతం వేలు పెడుతున్నారని ఫిర్యాదులు అందడంతో.. ఒకరిద్దరు వైసీపీ నాయకులను హై కమాండ్ సస్పెండ్ చేసింది కూడా. అయితే బాలినేనికి వ్యతిరేకంగా వర్గం కూడా తీయడంలో వైవి సుబ్బారెడ్డి సక్సెస్ అయ్యారు. బలమైన వర్గాన్ని రూపొందించుకున్నారు. దాదాపు బాలినేనిని ఒంటరి చేశారు. అందుకే ఓ సందర్భంలో తాను బి ఫారం లు ఇచ్చిన వారు సైతం తనను వ్యతిరేకిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం జగన్ అండ ఉందని బాలినేని ధీమాగా ఉండేవారు. ఇప్పుడు అదే సీఎం తనను కలిసేందుకు ముఖం చాటేయడంతో బాలినేనికి అసలు సినిమా అర్థమైంది. తనకు పొమ్మన లేక పొగ పెడుతున్నారని తెలిసి బాలినేని లోలోపల మదనపడుతున్నారు.