Chandrababu Legal Mulakat: చంద్రబాబు లీగల్ ములాఖత్ లు తగ్గించడానికి కారణం ఏంటి? ఒక్కసారికే పరిమితం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అదే సమయంలో రోజుకి మూడు ములాఖత్ కావాలని టిడిపి కోర్టును ఆశ్రయించింది ఎందుకు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీసినట్లు వైసిపి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ పార్టీ కుదేలు అవ్వడం ఖాయమని భావించింది. కానీ తెలుగుదేశం పార్టీ నిలబడింది. లోకేష్, భువనేశ్వరి, బాలకృష్ణ, బ్రాహ్మణిలతో పాటు టిడిపి సీనియర్ నాయకులు యాక్టివ్ గా పని చేస్తున్నారు.అయితే దీని వెనుక చంద్రబాబు వ్యూహాలు ఉన్నాయన్నది వైసిపి అనుమానం. అందుకే ములాఖత్ లు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొద్దిరోజుల కిందట దళిత యువకుడు హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడు. ఆయనకు ప్రతిరోజు ములాఖత్ లు కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబు ఉండగా.. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో సకల సౌకర్యాలు కల్పించారని టిడిపి చెబుతోంది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో సైతం సజ్జల డైరెక్షన్లోనే జైలు అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పెరగడం, దాని వెనుక చంద్రబాబు వ్యూహాలు ఉన్నాయని తెలియడంతోనే ఈ నిర్ణయానికి వచ్చారని అనుమానిస్తున్నారు.
వాస్తవానికి చంద్రబాబు అరెస్టు తరువాత తెలుగుదేశం పార్టీ కకావికలం అవుతుందని వైసిపి నాయకత్వం భావించింది. త్వరలో తెలుగుదేశం పార్టీ చీలిపోనుందని ఒకరిద్దరు నాయకులు వ్యంగ్యంగా మాట్లాడారు. హేళన చేశారు. కానీ వారి అంచనాలేవీ ఫలించలేదు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గట్టిగానే పోరాడుతున్నాయి. అటు చంద్రబాబును కలిసి జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణం పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతున్నాయని వైసిపి భావిస్తోంది. ఆయనను నేతలు తరచూ కలిస్తే.. ఆయన లోపల ఉన్నా.. బయట ఉన్న ఒకటేనని.. అంతకంటే మించి ఆయన్ను నేతలు కలిసే ములాఖత్ లు తగ్గిస్తేనే మేలన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకే జైలులో ఖైదీలకు అసౌకర్యంగా మారిందని సాకుగా చూపి ములాఖత్ ల్లో కోత విధించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నారా భువనేశ్వరి, లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ” నిజం గెలవాలి” పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అటు లోకేష్ సైతం చంద్రబాబు నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. నవంబర్ నుంచి లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. అయితే ఈ కీలక నిర్ణయాల వెనుక చంద్రబాబు వ్యూహాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తెలుగుదేశం పార్టీ విస్తృత కార్యక్రమాలు జరగనున్నందున నాయకులు, కుటుంబ సభ్యులు, న్యాయవాదులు తరచూ కలిస్తే చంద్రబాబు వ్యూహాలు ఇట్టే అమలు అవుతాయని వైసిపి భావిస్తోంది. అందుకే చంద్రబాబును లీగల్ ములాఖత్ లు తగ్గించిందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రోజుకు మూడు ములాఖత్ లు కావాలని టిడిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వైసీపీ అనుమానం నిజమేనని తేలుతోంది.