Congress Vs BJP
Congress Vs BJP: తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.. నిజమే కదా.. ఎన్నికల రేసు కోసం అనుకుంటే పొరపాటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతర్గత కుమ్ములాట పోటీ పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కే పరిమితమైన ఆ సంస్కృతి ఇటీవల బీజేపీకి పాకింది. వలస నేతలు, అసలైన బీజేపీ నేతల మధ్య పొసగడం లేదు. దీంతో బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం, ప్రెస్మీట్లు నిర్వహించడం కనిపిస్తోంది.
సొంత పార్టీ నేతలపైనే పోరాటం..
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. తమ పార్టీ విషయాలపై తాము మాట్లాడతామంటారు. కానీ, ఆ సాకుతో సొంత పార్టీ నేతలతోపాటు, అధిష్టానంపైనా విమర్శలు గుప్పిస్తుంటారు. తిరుగుబాటు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక గ్రూపు రాజకీయాలకే కొదవేలేదు. కాస్త పలుకుబడి ఉన్న ప్రతీ నాయకుడు కాంగ్రెస్‌లో గ్రూపులు మెయింటేన్ చేయడం కామన్. సమయం వచ్చినప్పుడు అధిష్టానం ముందు బల ప్రదర్శనకు దిగుతుంటారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇతర పార్టీలపై పోరాడటం కన్నా వారిలో వారు పోరాడటానికే కాంగ్రెస్ నేతలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు.
కాంగ్రెస్ బాటలో బీజేపీ..
బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం నిబద్ధత కలిగిన నేతలు, కార్యకర్తలు ఉంటాన్న పేరు ఉంది. అయితే అదంతా టీ బీజేపీలో గతంలా మారింది. పరిస్థితి చూస్తుంటే రానురానూ కాంగ్రెస్‌లా మారిపోయేలా కనిపిస్తోంది. తాజాగా.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఫాంహౌస్‌లో సొంత పార్టీ నేతలతో రహస్య భేటీ నిర్వహించడమే నిదర్శనం. విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నరసయ్య వంటి నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం ఎజెండా ఏమిటో ఎవరికీ తెలియదు.
బీజేపీని వీడతారని ప్రచారం..
కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగాయి. నేతలు క్రమశిక్షణ గీత దాటుతున్నారు. బహిరంగ ప్రెస్మీట్లు, రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. స్టేట్ చీఫ్‌పైనే విమర్శలు చేస్తున్నారు. అధిష్టానం తీరునూ తప్పు పడుతున్నారు. దీంతో బీజేపీలో ఇమడలేని వలస నేతలు పార్టీనుంచి వెళ్లిపోతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో జితేందర్‌రెడ్డి రహస్య భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో పాల్గొన్న ఇద్దరు మాజీ ఎంపీలు పార్టీని వీడతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
బండి, ఈటల వర్గాలు..
ఇక బీజేపీలో నేతలు బండి, ఈటల వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వారిలో కొంతమంది ఈటలవైపు ఉన్నారు. బండి సంజయ్ పదవీకాలం ముగిసినందున ఆయనను తప్పించాలని ఈటల వర్గం అధిష్టానాన్ని కోరుతోంది. ఈటలను టీబీజేపీ అధ్యక్షుడిని చేయాలని కోరుతోంది. వీరికి బీజేపీలోని బండి వ్యతిరేకవర్గం కూడా మద్దతు ఇస్తోంది. ఇక బండి వర్గం మాత్రం ఈటల వర్గం తీరును వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై ఇరువర్గాల నేతలు కొంతమంది ఢిల్లీ వెళ్లి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటలకు టీ బీజేపీ పగ్గాలు ఇస్తారని, బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం మొదలైంది.
మొత్తంగా అంతర్గత కుమ్ములాటలో కాంగ్రెస్‌ను అనుసరిస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు తెలంగాణలో అధికారం లోకి రావాలన్న ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలో ఇమడలేని నేతలు త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ను ఓడించే పార్టీగా .. కాంగ్రెస్‌కు ఇమేజ్ మరింత పెరిగితే.. బీజేపీలోని వలస నేతలంతా వెళ్లిపోవడం ఖాయం.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: In telangana national parties congress and bjp are competing for victory
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com