Telangana Elections 2023: తెలంగాణలో ఇప్పుడు అందరి ఆరాటం టీడీపీ ఓట్లపైనే.. ఇంతకీ ఎవరికి దక్కుతాయి?

ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం బిజెపితో కలిసి జనసేన అడుగులు వేస్తోంది. ఏపీలో పొత్తులు ఉన్న దృష్ట్యా తెలంగాణ ఎన్నికల్లో టిడిపి సపోర్ట్ చేయాలని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో కోరుతున్నారు.

Written By: Dharma, Updated On : November 13, 2023 2:55 pm

TDP

Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో అందరి దృష్టి తెలుగుదేశం కేడర్ పైనే ఉంది. ఆ పార్టీ అభిమానులు ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో నన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీపీ అధ్యక్షుడు రాజీనామా చేసి మరి బిఆర్ఎస్ లో చేరారు. ఆయన స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు సైతం చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఎన్నికల అనంతరమే నూతన అధ్యక్షుడిని నియమిస్తామని సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఉన్న క్యాడర్ను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేయడం విశేషం.

ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం బిజెపితో కలిసి జనసేన అడుగులు వేస్తోంది. ఏపీలో పొత్తులు ఉన్న దృష్ట్యా తెలంగాణ ఎన్నికల్లో టిడిపి సపోర్ట్ చేయాలని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో కోరుతున్నారు. అటు జనసేన అభ్యర్థుల సైతం చంద్రబాబు ఫోటోను వాడుకుంటున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అలాగని పాజిటివ్ గా కూడా స్పందించడం లేదు. అటు టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు రేవంత్ రెడ్డి కారణమన్న చర్చి నడుస్తోంది. ఇటీవల రేవంత్ చేసిన వ్యాఖ్యలు టిడిపి శ్రేణులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతర్గతంగా ఆయన టిడిపి శ్రేణులను తన వైపు తిప్పుకుంటున్నారు అన్న ప్రచారం జరుగుతోంది.

భారతీయ జనతా పార్టీ సైతం ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది అంతర్గతంగా పవన్ ద్వారా టిడిపి శ్రేణులను ఆకర్షించాలన్నది వ్యూహంగా తేలుతోంది. తెలంగాణలో పొత్తులు వర్క్ అవుట్ అయితే.. ఏపీలో సైతం మార్గం సుగమం అవుతుందని.. చివరి నిమిషంలో అయినా తెలుగుదేశం పార్టీ దారిలోకి వస్తుందని బిజెపి అంచనా వేస్తోంది. కానీ ఎక్కడ బాహటంగా మద్దతు తెలపాలని టిడిపిని ఇంతవరకు బిజెపి కోరలేదు. అయితే చంద్రబాబు బెయిల్ తదనంతర పరిణామాల నేపథ్యంలో.. చాలా రకాలుగా ప్రచారం జరిగినా.. టిడిపి నాయకత్వం మాత్రం ఎక్కడా నోరు తెరవడం లేదు.

అటు అధికార బీఆర్ఎస్ సైతం టిడిపి విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాదులో జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేసరికి తన గొంతును సవరించుకున్నారు. చంద్రబాబు అరెస్టుపై లోకేష్ కు సానుభూతి తెలిపారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నిన్నటి వరకు కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేందుకే టిడిపి పోటీ నుంచి తప్పుకుందని చేసిన కామెంట్స్ జోలికి సైతం వెళ్లడం లేదు. చంద్రబాబు అరెస్టుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసమే నన్న చర్చ అయితే ప్రారంభమైంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.