Munugode By Elections: మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ప్రధాన పార్టీలు అయిన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. నియోజకవర్గంలో పోటీ కూడా ఈ మూడు పార్టీల మధ్యే ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే బరిలోకి దించాయి. టీఆర్‌ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వగా, బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బరిలో నిలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన కాంగ్రెస్ సీనియన్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించింది. త్రిముఖ పోరులో ఎవరు గెలిచినా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే మునుగోడు ఎమ్మెల్యే అవుతారు. సాధారణ ఎన్నికలకు ఏడాదిన్న సమయం ఉంది. ఈ ఏడాదిన్నరపాటు నియోజకవర్గంలో ‘రెడ్డి’స్వామ్య పాలనే జరుగుతుంది. బీఎస్పీ మునుగోడు బరితో తమ అభ్యర్థిని నిలిపింది. బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. ప్రజాశాంతి, తెలంగాణ జన సమితి, ఇతర చిన్న పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ను బరిలో దించాలని చూస్తున్నాయి. అయితే వీరి పోటీ నామమాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీసీలకు టికెట్ ఇవ్వని ప్రధాన పార్టీలు..
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలేవీ బీసీలకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయా పార్టీల్లోని బీసీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలు ఉన్నాయి. బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మునుగోడు మాత్రమే. దీంతో బైపోల్‌లో బీసీలకే టికెట్ ఇవ్వాలని కుల సంఘాలు మొదటి నుంచీ డిమాండ్ చేస్తూ వచ్చాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంతోపాటు, గౌడ, యాదవ, ముదిరాజ్, పద్మశాలి సంఘాలు బీసీలకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే మునుగోడు కేంద్రంగా గౌడ, యాదవ, పద్మశాలీ సంఘాల పెద్దలు మీటింగులు పెడ్తూ తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. బీసీలకు టికెట్ ఇవ్వకుంటే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కానీ టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓసీలకు, అందులోనూ రెడ్డి సామాజికవర్గానికే టికెట్లు ఇచ్చాయి. తీరా ఇప్పుడు వారిని గెలిపించుకునేందుకు బీసీల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీల తీరుపై బీసీ సంఘాల నేతలు మండిపడ్తున్నారు.
తిరుగుబాటు చేసినా..
అధికార పార్టీకి ఆదిలోనే బీసీ లీడర్ల నుంచి తిరుగుబాటు ఎదురైంది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి లాంటి వారంతా టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించబోమని తేల్చి చెప్పారు. ఒకదశలో ఆయనకు టికెట్ ఇవ్వవద్దని స్థానిక ప్రజాప్రతినిధులతో మీటింగులు పెట్టి మరీ చెప్పించారు. కానీ ఇవేమీ పట్టించుకోని హైకమాండ్ చివరికి కూసుకుంట్లకే టికెట్ ఖరారు చేసింది. బూర నర్సయ్య, కర్నె లాంటి లీడర్లను పలుమార్లు హైదరాబాద్‌కు పిలిపించి బుజ్జగించింది. ఇప్పటికీ ఆయా నేతలను దూరంగానే పెడ్తోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఆ పార్టీ ఆయనకే మళ్లీ చాన్స్ ఇవ్వక తప్పలేదు. టీఆర్‌ఎస్ లాగానే కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్ కొట్లాట జరిగింది. బీసీ లీడర్లు పున్నా కైలాష్ నేత, పల్లె రవికుమార్ లాంటి వాళ్లు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కొత్తగా పార్టీలో చేరిన డాక్టర్ సుధాకర్‌గౌడ్ తనకు టికెట్ వస్తదని ఆశించారు. మరోవైపు బీసీలకు దీటుగా ఓసీ వర్గం నేతలు కూడా టికెట్ కోసం పట్టుబట్టారు. ఓ వైపు పాల్వాయి స్రవంతి, మరోవైపు చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ పడ్డారు. పలు సమీకరణాల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ స్రవంతికే టికెట్ ఇచ్చింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు రెడ్లకే టికెట్లు ఇవ్వడంతో బీసీ నేతల్లో నిరాశ అలుముకుంది.
ఓసీ అభ్యర్థుల కోసం బీసీల మద్దతు..
ఓసీలకు టికెట్ ఇచ్చిన ప్రధాన పార్టీలు ఇప్పుడు బీసీల ఓట్ల కోసం ఆయా కులాల వెంటపడుతున్నాయి.
– ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ, గొల్ల కుర్మలకు గొర్రెల చెక్కులు, గౌడ్‌లకు నీరా లైసెన్స్‌లు, పద్మశాలీలకు నేతబంధు, ప్రభుత్వం నుంచి లోన్లు, ముదిరాజ్‌లకు చేపపిల్లల పంపిణీ ఆశచూపుతూ ఓట్లడుగుతోంది. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కుల సంఘాల వారీగా మీటింగులు పెట్టి హామీలు గుప్పిస్తున్నారు.
– బీజేపీ తమ వల్లే బీసీలకు ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ప్రచారం చేసుకుంటోంది.
– కాంగ్రెస్ లీడర్లు బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు గొర్రెలు, బర్రెలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికుల గురించి పట్టించుకోని ప్రభుత్వం కేవలం ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే స్కీములు, పైసలు ఇస్తోందని విమర్శిస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీల వైఖరిపై బీసీ లీడర్లు మండిపడ్తున్నారు.
66 శాతం బీసీ ఓటర్లే..
మునుగోడు నియోజకవర్గంలో 2.27 లక్షల మంది ఓటర్లుండగా, ఇందులో లక్షన్నర మంది అంటే 66 శాతం బీసీ ఓటర్లే. వీరిలోనూ గౌడ, యాదవ, పద్మశాలీ, ముదిరాజ్ కులాలదేపైచేయి. అందువల్లే బూర నర్సయ్యగౌడ్ టీఆర్‌ఎస్ టికెట్ కోసం పట్టుబట్టారు. కర్నె ప్రభాకర్ భార్య పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయన కూడా సీరియస్‌గానే ప్రయత్నించారు. మునుగోడులో బీసీలకు టికెట్ ఇవ్వాలని గౌడ, యాదవ కుల సంఘాలు ప్రత్యేకంగా మీటింగ్‌లు పెట్టి మరీ డిమాండ్ చేశాయి.