అక్రమ మద్యం.. ఏపీలో అరాచకం

అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్‌.. తర్వాతి కాలంలో ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలుపుకుంటున్నారు. విడతల వారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం రేట్లను ఏకంగా 67 శాతం పెంచారు. బార్లు, వైన్స్‌ల సంఖ్య తగ్గించారు. ఇంకా తగ్గిస్తూనే ఉన్నారు. అందుకే.. తెలంగాణ మద్యంకు ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది. కొంతమంది ఇక్కడి నుంచి […]

Written By: NARESH, Updated On : September 3, 2020 1:50 pm
Follow us on


అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్‌.. తర్వాతి కాలంలో ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలుపుకుంటున్నారు. విడతల వారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం రేట్లను ఏకంగా 67 శాతం పెంచారు. బార్లు, వైన్స్‌ల సంఖ్య తగ్గించారు. ఇంకా తగ్గిస్తూనే ఉన్నారు. అందుకే.. తెలంగాణ మద్యంకు ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది. కొంతమంది ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్లి అక్కడ అమ్ముకుంటున్నారు. అయితే.. అలా అమ్ముతున్న వారిని దొరకబట్టి ఎక్సైజ్‌ పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అక్రమ మద్యం విక్రయిస్తున్నారంటూ ఓ కుటుంబంపై ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఒకరు విచక్షణారహితంగా దాడిచేశారు. అక్రమంగా మద్యం తీసుకొచ్చారని ఇంట్లో అణువణువూ వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదు. దీంతో శివాలెత్తిన ఎస్‌ఐ తొమ్మిదేళ్ల బాలుడితో సహా అతని తాతను కొట్టుకుంటూ తీసుకెళ్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో నిర్బంధించాడు. ఇంట్లోని నగదు, ఉంగరాలను కూడా తీసుకెళ్లాడు. ఇప్పుడు ఇది వివాదమైంది.

అంబాజీపేట మండలం గంగలకుర్రుకు చెందిన దివ్యాంగుడైన జయన పరాంకుశం నుంచి 17 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో రాజోలు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఎస్‌ఐ నరసింహమూర్తి ఈ కేసు విచారణలో భాగంగా అంబాజీపేటలో అద్దెకు ఉంటున్న కోలా వెంకటరత్నం ఇంటిపై మంగళవారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. ఎస్‌ఐ నరసింహమూర్తి, సిబ్బంది కలిసి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. తమ కుటుంబ సభ్యుల పట్ల దారుణంగా ప్రవర్తించారని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.20వేల నగదు, నాలుగు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలేమీ దొరక్కపోవడంతో శివాలెత్తిన ఎస్‌ఐ తాత, తొమ్మిదేళ్ల మనువడిని కొట్టుకుంటూ వెళ్లి జీపులో పడేశాడు.

ఆ తాత మనవడిని అమలాపురం ఎక్సైజ్ స్టేషన్‌లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేయడంతోపాటు మద్యం బాటిళ్ల కోసం వేధించారు. వివాదం పెద్దల దృష్టికి వెళ్లడంతో రూ.25వేలు ఇచ్చి సెటిల్‌ చేసుకోవాలని ఎస్సై బేరసారాలు ఆడినట్లు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శైలజారాణి జోక్యం చేసుకొని కోలా వెంకటరత్నం దగ్గర తెలంగాణకు చెందిన 20 బాటిళ్లు దొరికినట్లు చెబుతున్నారు. టీవీఎస్‌ స్కూటర్‌‌లో ఈ బాటిల్స్‌ దొరికాయని, అందుకే అతనిపై కేసు నమోదు చేశామని చెప్పారు. తొమ్మిదేళ్ల బాలుడిని స్టేషన్‌లోనే పద్దెనిమిది గంటలపాటు నిర్బంధించిన వ్యవహారంపై వివరణ కోరితే ఆమె స్పందించలేదు. తాత, మనువడిని జీప్‌లో ఎక్కించేటప్పుడు మద్యం సీసాలు కానీ, వాహనం కానీ స్వాధీనం చేసుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.