CM Jagan: ఏపీలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగడం లేదు. ప్రజలు అంతులేని విజయం అందించారు మాకెందుకు రాజ్యాంగంతో పని అన్నట్టుంది వైసీపీ సర్కారు తీరు. న్యాయవ్యవస్థను అస్సలు లెక్కచేయడం లేదు. కోర్టు ఎన్ని ఆదేశాలిచ్చినా పాటించడం లేదు. పోనీ నచ్చకుంటే పైకోర్టులోఅపీల్ చేయడం లేదు. అలాగని అమలు చేయడంలేదు. కావాలనే జాప్యం చేస్తూ వస్తున్నారు. న్యాయం కోసం వ్యయప్రయాసలకు గురై కోర్టు తలుపుతట్టే బాధితులు అక్కడ స్వాంతన పొందుతున్నారు. కానీ వాటిని అమలుచేయాల్సిన ప్రభుత్వం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వులు, ఆదేశాలను ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వకపోవడంతో బాధితులకు న్యాయం జరగకుండా పోతోంది. న్యాయ వ్యవస్థ నవ్వులపాలవుతోంది.

కోర్టు ఇచ్చిన తీర్పులను అమలుచేయకుంటే వాటిని ధిక్కరణ కేసులుగా పరిగణిస్తారు. గత ఏడాదిగా హైకోర్టులో దాఖలైన కేసులు అక్షరాలా నాలుగు వేలు. కొన్నేళ్ల కిందట పదుల సంఖ్యలో ఉండే కోర్టు ధిక్కరణ కేసులు..ఇప్పుడు వేలల్లోకి పెరిగాయంటే అది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే. కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అమలుచేస్తారని చాలామంది బాధితులు ఇంకా తిరుగుతుంటారు. వాటిని పరిగణలోకి తీసుకుంటే కోర్టు ధిక్కరణ కేసులు 5 వేల పైమాటే. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో ప్రజాప్రతినిధులు మాజీలయ్యేవారు. అధికారులు ఉద్యోగానికి దూరమయ్యేవారు. కానీ ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థే తన పని తాను చేయడం లేదు. న్యాయ వ్యవస్థ ఆదేశాలను అమలుచేయడం లేదు. పైగా మాపై పెత్తనం ఏమిటని తిరిగి ప్రశ్నించే దాకా పరిస్థితి వచ్చింది. దాని ఫలితమే వేలాది ధిక్కరణ కేసులు.
అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలకు అధికారులు మూల్యం చెల్లించుకుంటున్నారు. బ్యూరోక్రసి వ్యవస్థ మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏపీలో దాపురించింది. ప్రతీరోజూ ఏదోకేసులో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు బోనెక్కాల్సి వస్తోంది. కొద్దినెలల కిందట ఓ ధిక్కరణ కేసులో ఐఏఎస్ లు విచిత్ర తీర్పును ఎదుర్కొన్నారు. వారంలో ఒక రోజు స్వయంగా ప్రభుత్వ వసతిగృహాలకు వెళ్లి పిల్లలకు భోజనం పెట్టాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే వినడానికి ఇది చిన్న తీర్పే అయినా బిజీ షెడ్యూల్ లో గడిపే అధికార గణానికి ఈ తీర్పు గుణపాఠం నేర్పింది. అయినా పరిస్థితిలో ఎంత మాత్రం మార్పు రావడం లేదు. తప్పని తెలిసినా చేయడం… కోర్టు కేసులను ఎదుర్కోవడం.. తీర్పులను అమలుచేయకుండా ధిక్కరణకు పాల్పడడం ఏపీలో పరిపాటిగా మారింది.

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాలు వంటి ప్రభుత్వ భవనాల నిర్మాణం వద్దని 2020 జూన్ 11న హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ దానిని అమలుచేయలేదు. దీంతో అక్కడకు ఏడాది తరువాత 2021 జూలైలో 12న సుమోటాగా కోర్టు ధిక్కరణ కింద విచారణను ప్రారంభించిన కోర్టు సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను బాధ్యులుగా చేర్చి నోటీసులిచ్చింది. కోర్టు ఉత్తర్వులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అప్పటికప్పుడు కోర్టు ధిక్కరణ కేసులను సుమోటోగా స్వీకరించి బాధ్యులైన అధికారుల నుంచి వివరణలు కోరిన సందర్బాలు సైతం అధికం.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో అధికార గణం నిస్సహాయత కనిపిస్తోంది. ప్రభుత్వం తెలిసి చేస్తోందో.. తెలియక చేస్తోందో తెలియదు కానీ.. అధికారులను మాత్రం బోనులో ఎక్కించేందుకు ఉబలాటపడినట్టు కనిపిస్తోంది. చివరకు అధికార పార్టీ కింది స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు సైతం కోర్టును ఆశ్రయిస్తున్నారు. తమకు బిల్లులు చెల్లించాలని మొర పెట్టుకుంటున్నారు. అటు ప్రభుత్వ పెద్దల దయ ఉన్నవారికి బిల్లులు మంజూరు చేస్తున్న అధికారులు రాజకీయ సిఫారసులు లేని వారిని పక్కన పెడుతున్నారు. ఒక వేళ కోర్టు కేసు ఎదుర్కొనే పరిస్థితి వస్తేసొంత డబ్బులు చెల్లించి.. చెల్లింపులుచేశామని న్యాయస్థానానికి నివేదిస్తున్న అధికారులు ఉన్నారు. మా పరిస్థితి ముందుకు నుయ్యి.. వెనక్కి గొయ్యి అని మారిపోయిందని ఏపీలోఅన్ని శాఖల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ధిక్కరణ కేసులో ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందోనని తెగ భయపడుతున్నారు. అందుకే ప్రభుత్వంలో అప్రాధాన్యత పోస్టుతో ఇటువంటి కష్టాలు ఏవీ ఉండవని భావిస్తున్నవారు ఏపీలో అధికమవుతున్నారు.