Voter ID: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హైఓల్టేజ్‌లో సాగుతోంది. 2014, 2018లో లాగా, ఈసారి వార్ వన్‌సైడ్ అయ్యే అవకాశం ఏ కోశానా కనిపించడం లేదు. అధికార బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అని యుద్ధం చేస్తోంది. ఈ నెల 28న ప్రచారం ముగియనుంది. 30న పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా ఫైనల్ అయింది. ఇక, ఓటు వేయటానికి కీలకమైన ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఓటరు స్లిప్పులు అందని వారు ఉన్నారు. వీరు ఓటు ఎలా వేయాలి అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పోస్టల్ ఓట్లలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటర్లలో సందిగ్ధం తొలగించేందుకు ఎన్నికల అధికారులు స్పష్టత ఇస్తున్నారు.
చివరి దశకు పోలింగ్‌కు ఏర్పాట్లు..
తెలంగాణలో ఈ నెల 30న మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అటు బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీల అగ్రనాయకత్వం హైదరాబాద్‌లో మొహరించింది. అటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందించారు. ఈ నెల 25తో ఈ ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఓటరు స్లిప్పులు అందని వారు ఉన్నారు. ఓటరు స్లిప్పు లేకపోయినా..జాబితాలో పేరు ఉంటే ఓటు వేసే అవకాశం ఉంటుంది. గుర్తింపు కార్డులతో ఓటు వేయటానికి అనుమతిస్తారు.
ఓటర్ల స్లిప్పులు కోసం..
ఓటరు స్లిప్పును ఓటు వేసేందుకు వెళ్లే ముందే పొందేందుకు వీలుగా ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఎన్నికల వెబ్‌సైట్‌లో దీనిని పొందేందుకు అవకాశం ఉంది. డొమైన్‌లోకి వెళ్లగానే వెంటనే ఓటరు వివరాలు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పోలింగ్ సమయం, పోలింగ్ స్టేషన్ నంబర్ తదితర వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఓటరు నమోదు సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్ సాయంతో స్లిప్పును పొందొచ్చు. ఓటు వేయటానికి వెళ్లే వారు తమతో పాటుగా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఓటర్ కార్డ్ అందుబాటులో లేకపోతే, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, ఎన్ఆర్‌ఈజీఎస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయొచ్చు. ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌లోనూ ఓటర్ స్లిప్ పొందొచ్చు. దీని కోసం ప్లేస్టోర్ నుంచి ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం ఆ యాప్ సాయంతో ఓటరు కార్డుపై ఉండే క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదా ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ వివరాలతోపాటు పోలింగ్ కేంద్రం, సమయం తదితర వివరాలన్నీ పొందవచ్చు. గతం కంటే పోలింగ్ శాతం పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.