Telangana Elections 2023: ‘గవర్నమెంట్‌’ ఓట్లకు కేసీఆర్‌ గండి.. ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ అందకుండా వ్యూహం!

ఓటరు జాబితాలో పేరు నమోదుకు నెలల తరబడి అవకాశం ఇచ్చిన ఎన్నికల సంఘం.. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం ఒక్కరోజు అవకాశం కల్పించారు.

Written By: Raj Shekar, Updated On : November 26, 2023 3:42 pm
Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అందేంటి ఈనెల 30న పోలింగ్‌ కదా అనుకుంటున్నారా.. నిజమే! కానీ, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులకు ఎన్నికల సంఘం పోస్టల్‌ ఓట్లు కేటాయించింది. అదే విధంగా ఈసారి కొత్తగా దివ్యాంగులు, 80 పైబడిన వృద్ధులు ఇంటి నుంచే ఓటువేసే అవకావం కల్పించింది. ఈమేరకు 12డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియ మొదలైంది. అదే విధంగా పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా పోస్టర్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.

ఒక్కరోజే దరఖాస్తుకు అవకాశం..
ఓటరు జాబితాలో పేరు నమోదుకు నెలల తరబడి అవకాశం ఇచ్చిన ఎన్నికల సంఘం.. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం ఒక్కరోజు అవకాశం కల్పించారు. పోలింగ్‌ విధులు కేటాయించకముందే.. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో చాలా మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత పోలింగ్‌ విధులు కేటాయించింది. దీంతో ఉద్యోగులు తమకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకున్నవారి ఓట్లు గల్లంతు..
ఇక మరో విషయం ఏంటంటే.. దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు కూడా చాలా వరకు బ్యాలెట్‌ ఓటు ఇవ్వలేదు. అందేంటని అధికారులను అడిగితే ఆందోళన వద్దని, బాలెట్‌ఓటు ఇస్తామని చెబుతున్నారు. కానీ, అందరికీ ఓకే రోజు బ్యాటెల్‌ ఇవ్వాల్సి ఉండగా, కొందికే ఇవ్వడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

ఉద్యోగులంతా వ్యతిరేకమే..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నారు. నెలకు కనీసం 1వ తారీఖున వేతనాలు కూడా ఇవ్వని సర్కార్‌ వద్దని అంటున్నారు. డీఏలు పెండింగ్, బిల్లుల మంజూరులో జాప్యం, పీఆర్సీలో జాప్యం, తదితర కారణాలతో ఉద్యోగులంతా ఈసారి గులాబీ పార్టీకి బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ఈ విషయం గమనించిన కేసీఆర్‌ సర్కార్‌ ఎన్నికల సంఘం ద్వారా పోస్టర్‌ ఓట్లకు చెక్‌ పెట్టాలని చూస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా పరిస్థితి చూస్తుంటే కూడా అది నిజమే అనిపిస్తోంది. దరఖాస్తుకు ఒక్కరోజే గడువు ఇవ్వడం, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల్లో సగం మందికి ఓటు ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

ఉద్యోగులు తలచుకుంటే..
ఇదిలా ఉంటే.. ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. గత అనుభవాలు ఇవే చెబుతున్నాయి. నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విధులపై ఆంక్షలు విధించారు. సమయ పాలన కచ్చితం చేశారు. ఆలస్యమైతే వేతనంలో కోత విధించారు. దీంతో ఉద్యోగులంతా తర్వాత ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు. తాజాగా కేసీఆర్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఉద్యోగులకు సంఘాలు ఎందుకు అని ఉపాధ్యాయ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను రద్దు చేశారు. ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీలో జాప్యం జరుగుతోంది. పాత పెన్షన్‌ అమలు చేయడంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఉద్యోగులు బీఆర్‌ఎస్‌ను ఓడిస్తారని సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఓల్డ్‌ పెన్షన్‌ అమలుకు హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ప్రభుత్వం పోస్టల్‌ ఓట్ల వద్దనే ప్రభుత్వ వ్యతిరేక ఓటును అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే పోలింగ్‌ విధులు నిర్వహించే ఉద్యోగులు గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేయగలరు. ప్రధానంగా ఉపాధ్యాయులకు గ్రామీణులతో సత్సంబంధాలు ఉంటాయి. కేసీఆర్‌ వైఖరి నచ్చని ఉపాధ్యాయులు కేసీఆర్‌కు షాక్‌ ఇస్తారని విశ్లేషకులు, వివిధ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.