TRS MLAs Purchase Case: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, ఆయన దిశా నిర్దేశం మేరకు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ సీవీ.ఆనంద్.. కేసీఆర్ ఇస్తున్న భరోసాతో దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఏ కేసు దర్యాప్తులో ప్రదర్శించనంత దూకుడు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చూపుతున్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ మేరకు బీజేపీ జాతీయ నాయకులను ఇందులో ఇరికించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నాయకులకు ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా సిట్ భావిస్తూ విచారణకు హాజరు కావాలంటూ ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చింది. కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామితోపాటు కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా 41ఏ నోటీసులు ఇచ్చి ఈనెల 21న విచారణకు రావాలని సూచించింది. రాని పక్షంలో అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. దీంతో సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది.

హాజరు కాకపోతే..
ఇవ్వాళ ఆయన సిట్ విచారణకు శ్రీనివాస్, బీఎల్.సంతోష్ హాజరు కావాల్సి ఉంది. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో గల సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంది. దర్యాప్తునకు హాజరుకాకపోతే 41 ఏ (3), (4) సెక్షన్ల కింద అరెస్టు చేసే అధికారం తమకు ఉంటుందని కూడా సిట్.. ఆయనకు అందజేసిన నోటీస్‌లో స్పష్టం చేసింది. ఈ విచారణకు బీఎల్.సంతోష్ హాజరవుతారనేది అనుమానమే. ఇవ్వాళ ఆయన హైదరాబాద్‌కు రాకపోవచ్చని తెలుస్తోంది. మరి హాజరు కాని పక్షంలో సిట్ ఏం చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
మంగళవారం హైదరాబాద్‌కు వచ్చే అవకాశం..
తెలంగాణలో బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. మూడు రోజుల కార్యక్రమం మంగళవారం ముగియనుంది. ముగింపు కార్యక్రమానికి జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్‌కు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంటున్నాయి. పార్టీ వర్గాలు ఇస్తోన్న సమాచారాన్ని బట్టి చూస్తోంటే.. బీఎల్ సంతోష్ సిట్ విచారణకు గైర్హాజర్ కావడానికే అధిక అవకాశాలు కనిపిస్తోన్నాయి. శ్రీనివాస్ ఒక్కడే విచారణకు వచ్చే అవకాశం ఉంది. తుషార్, జగ్గుస్వామి కూడా వచ్చేది అనుమానమే అని తెలుస్తోంది.

అరెస్ట్‌కు రంగం సిద్ధం..
మంగళవారం నగరానికి వచ్చే బీఎస్.సంతోష్‌ను ఇక్కడే అదుపులోకి తీసుకోవాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సీవీ.ఆనంద్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. నోటీసుల్లో ముంందే పేర్కొన్నందున అరెస్ట్ చేసినా లీగల్‌గా ఎలాంటి సమస్య రాదని సిట్ భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం కోర్టు అరెస్ట్ చేయొద్దని ఆదేశించినందున అరెస్ట్ చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, అదే భరోసాతో సంతోష్ హైదరాబాద్‌కు వస్తున్నట్లు చెబుతోంది. ఈ క్రమంలో రేపు నగరానికి రానున్న ఆయనను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటారా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది.