Homeజాతీయ వార్తలుJamili Elections: ఆ ఐదు సవరణలు చేస్తే.. "జమిలీ" సాధ్యమే

Jamili Elections: ఆ ఐదు సవరణలు చేస్తే.. “జమిలీ” సాధ్యమే

Jamili Elections: 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని పలు సందర్భాల్లో నరేంద్ర మోడీ అన్నారు. అయితే దీని వైపు అడుగులు పడకపోయినప్పటికీ.. బిజెపి మదిలో ఈ ఆలోచన ఉంది. 29 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల సమ్మిళితమైన భారత దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిబంధకాలు త్వరలో సమసిపోతాయని, దీనికి సంబంధించి లా కమిషన్ రోడ్డు మ్యాప్ రూపొందించే పనిలో ఉందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిషన్ తో పాటు సంబంధిత వర్గాలతో పార్లమెంట్ స్థాయీ సంఘం కూడా జమిలి ఎన్నికలపై చర్చించిందని, స్థాయీ సంఘం తన నివేదికలో చేసిన సిఫారసులపై కమిషన్ పరిశీలిస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి చెప్పడం కొత్త చర్చకు తావిస్తోంది.

ఏమవుతుంది?

జమిలి ఎన్నికల నిర్వహిస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవుతుంది. పరిపాలన, శాంతి భద్రతల యంత్రాంగాల పని భారం తగ్గుతుంది. రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రచారానికి అయ్యే ఖర్చు తగ్గిపోతుంది..అలాగే, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఉప ఎన్నికలు తరచూ జరుగుతుండడంతో సుదీర్ఘకాలం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేయాల్సి వస్తోంది. ఇది అంతిమంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రభావం చూపిస్తోంది. ఇన్ని లాభాలు ఉన్నందున జమిలి నిర్వహించాలని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు బిజెపి ప్రభుత్వం దీని గురించి చర్చిస్తూనే ఉంది.. అయితే అప్పట్లో ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.. జమిలి ఎన్నికల ద్వారా దేశాన్ని ప్రజాస్వామ్యం నుంచి రాజురిక వ్యవస్థ వైపు తీసుకెళ్తున్నారని ఆరోపించాయి. ఆ తర్వాత వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆందోళనలు కూడా నిర్వహించాయి. ఈ క్రమంలో ఇక జమిలి ఎన్నికలు జరగవు అని అంచనాకు అందరూ వచ్చారు. కానీ హఠాత్తుగా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి గురువారం లోక్సభలో ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన నేపథ్యంలో మరొకసారి జమిలి ఎన్నికలపై చర్చ మొదలైంది.

అడ్డంకులు ఏమిటి

పార్లమెంటు ఉభయ సభల పదవీ కాలానికి సంబంధించి ఆర్టికల్ 83, రాష్ట్రపతి ద్వారా లోక్ సభ రద్దుకు సంబంధించి ఆర్టికల్ 85, రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి సంబంధించి ఆర్టికల్ 172, రాష్ట్ర అసెంబ్లీల రద్దుకు సంబంధించి ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి ఆర్టికల్ 356 సవరించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు మధ్య ఏకాభిప్రాయం ముఖ్యం. దేశంలో సమాఖ్య పాలన వ్యవస్థ ఉన్నందువల్ల అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం తప్పనిసరి. వైపు అత్యధికంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు అదనంగా సేకరించాల్సి ఉంటుంది. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. పోలీస్ సిబ్బంది, భద్రతా దళాలు అదనంగా అవసరమవుతాయి. దక్షిణాఫ్రికాలో ప్రతి ఐదు సంవత్సరాలకు జాతీయస్థాయిలో, ప్రాంతీయ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. రెండు సంవత్సరాల తర్వాత మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయి. ఇక ఇదే విషయాన్ని జమిలి ఎన్నికల సందర్భంగా స్థాయి సంఘం తన 79వ నివేదికలో తెలిపింది. ఇక స్వీడన్ దేశంలో నాలుగేళ్లకు ఒకసారి జాతీయ అసెంబ్లీ, స్థానిక అసెంబ్లీ, స్థానిక సంస్థలకు సెప్టెంబర్ లో రెండవ శనివారం రోజు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఇంగ్లాండ్లోని పార్లమెంటుకు పదవి కాలం స్థిరంగా ఉండేందుకు 2011లో ఒక చట్టం చేశారు. మరి ఈ ప్రకారం మనదేశంలో కూడా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ.. మిగతా పార్టీల విషయంలోనే ఒకింత ప్రతిబంధకం ఏర్పడుతోంది. అయితే ప్రధానమంత్రి అంతర్గతంగా వచ్చే టర్మ్ లోనైనా జమిలి ఎన్నికలు నిర్వహించాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version