
Tarakaratna- Nara Lokesh: ఓ ఏపీ మంత్రి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటనలో అమానవీయతను ఎత్తిచూపారు. నారా లోకేష్ మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా నారా లోకేష్ ను ఆడవాళ్లతో కొట్టిస్తానని ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ నారా లోకేష్ పాదయాత్రలో ఏం జరిగింది ? ఏపీ మంత్రి వ్యాఖ్యలు నేపథ్యం ఏంటి ? స్టోరీలో తెలుసుకోండి.
Also Read: Chetan Sharma Sting Operation: ఒక్క స్టింగ్ ఆపరేషన్ టీం ఇండియా పరువును బజారుకి ఈడ్చింది
టీడీపీ నేత నారా లోకేష్ పై ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో రోజా నారాలోకేష్ ను ఇరుకున పెట్టారు. లోకేష్ వ్యవహార శైలినే ప్రశ్నించేటట్టు రోజా వ్యాఖ్యలు ఉన్నాయి. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తారకరత్న చుట్టూ ఉన్న కార్యకర్తలు అతడిని.. అక్కడి నుంచి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి .. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నారు.
మంత్రి రోజా వ్యాఖ్యలకు.. తారకరత్న గుండెపోటుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? . అవును. నారా లోకేష్ పై మంత్రి రోజా సంచలన కామెంట్స్ కు తారకరత్న గుండెపోటుకు సంబంధం ఉంది. తారకరత్నగుండెపోటుతో కుప్పకూలితే.. నారాలోకేష్ పట్టించుకోకుండా పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాడని మంత్రి రోజా విమర్శించారు. తారకరత్న విషయంలో లోకేష్ అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించారు. తారకరత్న గుండెపోటుతో సొమ్మసిల్లితే లోకేష్ నవ్వుకుంటూ వెళ్లిపోయారని దుయ్యబట్టారు. తనను లోకేష్ జబర్దస్త్ ఆంటీ అని విమర్శించడం పై రోజా విరుచుకుపడ్డారు. లోకేష్ తల్లి, పెళ్లాం.. హెరిటేజ్ పాలు అమ్ముతున్నారని, వారిని హెరిటేజ్ బేబీలు అనాలా ? అని ప్రశ్నించారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే పళ్లు రాలుతాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ గురించి మరోసారి మాట్లాడితే ఆడవాళ్లతో కొట్టిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాఖ్యల పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

లోకేష్ పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటన, రోజా విమర్శలను పరిశీలించినట్టయితే.. రోజా విమర్శలలో సహేతుకత లేదన్నది అర్థమవుతుంది. రోజా విమర్శలలో స్పష్టమైన రాజకీయ కోణం ఉంది. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంలో తారకరత్న కుప్పకూలిన వెంటనే అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. చుట్టూ ఉన్న వేలాది మంది జన సమూహంతో తారకరత్న విషయం అంత త్వరగా లోకేష్ కు తెలిసే అవకాశం ఉండదు. లోకేష్ సన్నిహితులు విషయం తెలిపేంత వరకు.. లోకేష్ కు తెలిసే అవకాశం ఉండదు. తెలిసిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న పాదయాత్రను ఆపలేరు. అలాగని విషయం తెలిశాక లోకేష్ నవ్వుకుంటూ పాదయాత్ర చేశాడని విమర్శిస్తే.. నవ్వుకుంటూ కాక ఏడుస్తూ ప్రజల ముందుకు వెళ్తారా ? అన్న ప్రశ్న రాక మానదు. ఇక్కడ పాదయాత్ను ఆపడం, లోకేష్ నవ్వుతూ వెళ్లటం కాదు సమస్య.. తారకరత్న ప్రాణాలు కాపాడటం అన్న విషయం గుర్తించాలి. టీడీపీ నేతలు తారకరత్న ఆరోగ్యం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. అంతే కానీ గాలికి వదిలేయలేదు. మంత్రి రోజా వ్యాఖ్యలు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినవిగానే చూడొచ్చు.