PM Modi vs KCR: తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో ఏడాది గడువుంది. కాని దాని శాంపిల్ మునుగోడు ద్వారా తెలంగాణ ఓటర్లకు అర్థమైంది. తగ్గేదే లే అన్నట్టుగా టిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. టిఆర్ఎస్ నాయకుల పై కేంద్రం ఆదాయపు పన్ను శాఖ అధికారులను రంగంలోకి దింపింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన వ్యాపార సముదాయాలపై విస్తృతంగా దాడులు నిర్వహించింది. కేంద్ర పన్నులు ఎగ్గొడుతూ వ్యాపారాలు సాగిస్తున్నారని ఈడీ ప్రాథమికంగా ధ్రువీకరించింది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు బయట పెట్టింది. తదుపరి చర్యల కోసం సమాయత్తమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే 2023 నాటికి టిఆర్ఎస్ పార్టీకి ఆర్థిక సహకారం లేకుండా చేయాలనేదే బిజెపి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా మై హోమ్, మేఘా వంటి కంపెనీలపై కేంద్రం ఒత్తిడి తెచ్చింది. అవి జీ హుజూర్ అన్నాయి. దీంతో కేసీఆర్ ప్రత్యామ్నాయ మార్గంగా వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి వంటి వారి ని పార్టీలోకి ఆహ్వానించారు.. వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చారు. వారిని కూడా కేంద్రం వదిలిపెట్టడం లేదు.

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో
విజయదశమి సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కెసిఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మోదిపై యుద్ధం చేస్తామని శపథం చేశారు. ఈలోగా మునుగోడు ఉప ఎన్నిక రావటం, మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ యాదృచ్ఛికంగా బయట పడటం, పదివేల ఓట్ల మెజారిటీతో టిఆర్ఎస్ గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి వచ్చారు. ఇక అప్పటి నుంచి మళ్లీ టిఆర్ఎస్, బిజెపి మధ్య వైరం ప్రారంభమైంది. అయితే అంతకుమునుపే టీఆర్ఎస్ నాయకుల వ్యాపార సముదాయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు.. ఈ సందర్భంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో తెలియకపోయినా.. టిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చే విధంగానే కేంద్రం వ్యవహరించబోతోంది అన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
సుశి ఇన్ ఫ్రా కంపెనీపై దాడులు
కేంద్రానికి ఇన్ కం టాక్స్ ఉంటే తమకు వాణిజ్య పన్నుల శాఖ ఉందని టిఆర్ఎస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసింది. ఆయన కుమారుడు సంకీర్త్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సుశి ఇన్ ఫ్రా సంస్థలో రాష్ట్ర జిఎస్టి అధికారులు తనిఖీలు చేశారు. జిఎస్టి కమిషన్ కు చెందిన దాదాపు 150 మంది అధికారులు 25 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు.. బంజారాహిల్స్ లో ఉన్న సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్, సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్ మైన్స్ లిమిటెడ్ సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు.. హైదరాబాద్ లోని సుశీ గ్రూపునకు చెందిన 16 కంపెనీలపై రాత్రి పొద్దుపోయేంతవరకు తనిఖీలు చేశారు.. వీటిలో ఒక సంస్థ సహకరించకపోవడంతో దాని లాకర్ ను అధికారులు సీజ్ చేశారు. జీఎస్టీ రిటర్న్ లు, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న కారణంతో అధికారులు సోదాలు చేసినట్టు చెబుతున్నారు. పన్ను రిటర్ను ల పత్రాలు, చెల్లింపులకు సంబంధించిన హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. సుశీ కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేశారు.. కొద్ది రోజుల్లోనే దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

మునుగోడు ఎన్నికలతో సంబంధం
మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి, టిఆర్ఎస్ హోరాహోరిగా తలపడ్డాయి. ఒకానొక దశలో బిజెపి గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే కెసిఆర్ చాకచక్యం వల్ల టిఆర్ఎస్ 10వేల కోట్ల మెజారిటీతో మాత్రమే గెలిచింది. అయితే తన పంటిలో రాయి లాగా మారిన బిజెపిని మరింత ఇరుకున పెట్టాలని కెసిఆర్ భావించి జీఎస్టీ అధికారులను రంగంలోకి దించారు.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి నాయకులు సుశీ ఇన్ ఫ్రా నుంచే లావాదేవీలు జరిపారని టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి అప్పట్లో ఫిర్యాదు చేశారు.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సూచన మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణిజ్య పనుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, జాయింట్ కమిషనర్లను బి ఆర్ కే భవన్ కు పిలిపించి సుశీ కంపెనీపై చేసే సోదాలపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అటు ఈడి, ఇటు వాణిజ్య పనుల శాఖ… మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో రాజ్యాంగ సంస్థలు చిక్కి విలవిలలాడుతున్నాయి.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మున్ముందు ఇది దేనికి దారితీస్తుందో వేచి చూడాలి.