Pawan Kalyan- Modi: పవన్ రాజకీయ వ్యూహం మార్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనకు ఒక ,చాన్సివ్వాలని ప్రజలను కోరుతున్నారు. వైసీపీకి తానే ప్రత్యామ్నాయమని ఆయన భావిస్తున్నారు. జనసేన మాదిరిగా వైసీపీని ఎదుర్కొవడంలో టీడీపీ ఫెయిలైందని కూడా చెబుతున్నారు. అందుకే వైసీపీని గట్టిగా ఎదుర్కొంటామని.. అన్నిచోట్ల అభ్యర్థులను రంగంలోకి దించుతామంటున్నారు. నిన్నటి వరకూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఓటును చీలిపోనివ్వనని చెప్పుకోవడం ద్వారా పొత్తు సంకేతాలిచ్చిన పవన్.. ప్రధానితో భేటీ తరువాత స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అప్పట్లో చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. ఇవి పొలిటికల్ సర్కిల్ లో కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. అటు ప్రధాని మోదీపై పవన్ సోషల్ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

అటు ఇప్పటివరకూ సానుకూలంగా వ్యవహరిస్తున్న టీడీపీపై కూడా పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీనియర్ కావడంతో నాడు చంద్రబాబుకు అవకాశమిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈసారి తనకు విడిచిపెట్టాలని కోరుతున్నారు. అటు ప్రజల్లోకి ఒక చాన్స్ అన్న నినాదాన్ని విడిచిపెట్టారు. అయితే ప్రధాని మోదీని కలిసిన తరువాతే పవన్ లో మార్పు వచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటం ఇష్యూతో పవన్ తో పాటు జనసేన గ్రాఫ్ పెరిగిందని.. వైసీపీ ప్రజల్లో చులకనైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే పవన్ కూడా వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేనను చూడడం ప్రారంభించారని.. అందుకే ప్రభుత్వంపై మరింత దూకుడుగా వ్యవహరించాలని పవన్ భావిస్తున్నారు.
ఈ పరిణామ క్రమంలో పవన్ వైఖరిలో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతానని చెబుతున్నారు. దాదాపు పొత్తు అన్న మాట మరిచిపోయినట్టు వ్యవహరిస్తున్నారు. అటు ప్రధాని పిలిచి మాట్లాడినా బీజేపీ ప్రస్తావన కూడా ఎక్కడా తీసుకు రావడం లేదు. మొన్న విశాఖలో పవన్ ను అడ్డుకున్న క్రమంలో నేరుగా చంద్రబాబు వచ్చి మరీ సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో కలిసి నడుస్తామని అటు పవన్, ఇటు చంద్రబాబు ఉమ్మడిగా ప్రకటించారు. కానీ పవన్ మాత్రం ఒంటరి పోరుకు సన్నద్ధమవుతుండడం విశేషం.

అయితే పవన్ తాజా వ్యవహార శైలితో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అటు పవన్ దూకుడుగా ముందుకు సాగుతుండగా అధినేత చంద్రబాబు, తనయుడు లోకేష్ ఆ స్థాయిలో ప్రభుత్వంపై పోరాటం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ పోరాటాన్ని గుర్తుచేసుకొని ఆయన్ను అనుసరించాలని సాధారణ టీడీపీ కార్యకర్త సైతం కోరుకుంటున్నారు. మొత్తానికైతే పవన్ మార్చిన స్ట్రాటజీతో అటు అధికార పార్టీలో కలవరపడుతుండగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి తాము వెనుకబడిపోయామన్న బెంగ వెంటాడుతోంది.