AP CID – TV5 Murthy: ప్రశ్న.. ఇది కేవలం రెండు అక్షరాలు మాత్రమే.. ప్రపంచ గతిని మార్చేసిన ఘనత ప్రశ్న సొంతం.. హిట్లర్ నుంచి ఇందిరా గాంధీ వరకు ప్రశ్నకు తలవంచిన వాళ్లే. సాధారణంగా ప్రశ్న అనేది పాత్రికేయం ప్రాథమిక లక్షణం. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎలా? ఈ ఐదు లక్షణాలే పాత్రికేయాన్ని నడిపిస్తాయి.. ఇప్పుడంటే పాత్రికేయం రాజకీయ రంగు వేసుకుంది. దేనికో ఒక దానికి డప్పు కొడుతూనే ఉంది. ఇక్కడ లోతుల్లోకి వెళ్లడం లేదు గాని.. ఇప్పుడున్న మీడియాలో ఎవరూ సుద్దపూసలు కాదు అనేది మాత్రం స్పష్టం. ప్రభుత్వ పెద్దలే మీడియా రంగంలోకి వస్తున్నాకా ఇక ప్రశ్న అనే దానికి అవకాశం ఎక్కడిది?

భరించలేకపోతున్నారు
తెలంగాణ ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ వరంగల్ సభలో తన అడుగులకు అడుగులు వత్తని మీడియాను ఎనిమిది కిలోమీటర్ల లోతులో పాతేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వంటి చానళ్ళ పై నిషేధం విధించారు. అయితే టీవీ9 తన అనుయాయుల చేతిలోకి వెళ్లడంతో ఆ నిషేధం నుంచి దానికి మినహాయింపు లభించింది. ఇదే సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సుదీర్ఘకాలం పోరాటం చేసి ప్రభుత్వంపై గెలిచింది. అయితే అప్పటికి ఇప్పటికి ఆంధ్రజ్యోతి కెసిఆర్ పై పోరాటం చేస్తూనే ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ రెండు పత్రికల ఉదంతాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.. చంద్రబాబు కూడా ఎన్టీవీ ఛానల్ పై నిషేధం విధించారు. ఇక జాతీయస్థాయిలో అయితే అర్ణబ్ గోస్వామి ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జైల్లో పెట్టించింది. ఇకముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఆంధ్రజ్యోతి ప్రచురించిన బాడుగనేతలు అనే కథనం రచ్చకు దారితీసిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ జైలుకు కూడా వెళ్లారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి, పాత్రికేయానికి యుద్ధం అప్పుడే ప్రారంభమైంది.
టీవీ5 మూర్తి పై కేసు
సంధించే ప్రశ్నకు ప్రభుత్వాలు ఎలా భయపడుతున్నాయో టీవీ5 మూర్తి ఉదంతమే ఒక ప్రబల ఉదాహరణ. ఏపీలో ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి ఒక్కరి వెంటపడుతున్న సిఐడి టీవీ5 మూర్తిని కూడా వెంటాడుతోంది. అసలు పెట్టిన కేసుల్లో చార్జిషీటు దాఖలు చేయకపోయినప్పటికీ కేసులు నమోదు చేసిన వారిని ఇబ్బంది పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గతంలో నమోదైన కేసులో మూర్తిని పలుమార్లు విచారణకు పిలిపించింది. ఇందుకు హైకోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో ఇక తనకు అడ్డు లేదనుకుంది. అలాగే మూర్తిని కూడా పిలిచింది. మనకు కూడా విజయవాడ వెళ్లారు. ఇదే సమయంలో మూర్తి విచారణ రికార్డు చేయాలని, లాయర్ సమక్షంలోనే ప్రశ్నించాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ముందుగా వెళ్లిన మూర్తి తరపు లాయర్ గుర్తించి వెంటనే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం వాదనలు వింటోంది. ఈ కథనం పబ్లిష్ చేసే సమయానికి ఇంకా తుది తీర్పు రాలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిఐడి పోలీసులు మూర్తి తరఫు లాయర్ కు ఫోన్ చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని విచారణకు రావాలని కోరారు. ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి అందులోనే తేల్చుకుంటామని మూర్తి తరఫు లాయర్ చెప్పారు. వాస్తవానికి గతంలో ఆంధ్రాలో విశ్వవిద్యాలయాల్లో నియమించిన పాలకమండలి సభ్యులకు సంబంధించి ఒక వార్తను టీవీ 5లో ప్రసారం చేశారు. ఆ నోట్ ఫైల్ ను మూర్తి టీవీ స్క్రీన్ పై చూపించారు. అయితే దానిని చోరీ చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూర్తిపై కేసు పెట్టారు. ఆ కేసులో గతంలో చాలాసార్లు ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. ఈ కేసును ఇంకా సాగదీస్తున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నందున జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి సిఐడి పోలీసులను ఉసి గొల్పుతున్నారని టీవీ5 ఆరోపిస్తోంది. అయితే ఇంకా ఈ కేసును ఏపీ సిఐడి ఎన్ని రోజులు సాగదిస్తుందో వేచి చూడాల్సి ఉంది.