Homeజాతీయ వార్తలుకాంగ్రెస్‌ కన్నెర్ర చేస్తే.. ఠాక్రే పరిస్థితి ఏంటి..?

కాంగ్రెస్‌ కన్నెర్ర చేస్తే.. ఠాక్రే పరిస్థితి ఏంటి..?

Uddhav thackeray
రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరం ఊహించలేం. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరో రాష్ట్రంలో సహకారం ఇస్తుందనేది ఉండదు. ఒకరాష్ట్రంలో పొత్తులో ఉన్న పార్టీలు.. ఇంకో రాష్ట్రంలోనూ ఆ పొత్తును కొనసాగిస్తాయని నమ్మలేం. ఇప్పుడు సరిగా.. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో అదే స్పష్టం అవుతోంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ అనే చెప్పాలి. ఆ పార్టీ సహకరించడం వల్లే ఆయన ఆ పదవిలో ఉన్నారు. అయినా.. బెంగాల్‌ లో మాత్రం ఉద్ధవ్ థాక్రే మాత్రం కాంగ్రెస్ కంటే తృణమూల్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. శివసేన టీఎంసీకి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో బీజేపీతో స్నేహం చెడిన తర్వాత హుటాహుటిన ఉద్ధవ్ థాక్రే టెన్ జన పథ్‌కు బయలుదేరి వెళ్లారు. కుమారుడితో కలసి సోనియా గాంధీ ఆశీస్సులు తీసుకున్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రధాన కారణమనే చెప్పాలి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ, తమకు తాము పరిమితులు విధించుకోవడం వల్లనే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం సజావుగా నడుస్తుంది.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుగా శివసేన భావించింది. ఇందుకోసం ఉద్ధవ్ థాక్రే ఒక కమిటీని సైతం నియమించారు. కమిటీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి శివసేనకు అనుకూలమైన నియోజకవర్గాల జాబితాను కూడా రెడీ చేసి ఇచ్చింది. కానీ.. చివరి క్షణంలో ఉద్ధవ్ థాక్రే మనసు మార్చుకున్నారు. బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదని మమతకు ఉద్దవ్ థాక్రే మద్దతు ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ కూడా పోటీ చేస్తోంది. కమ్యూనిస్టులతో కలిసి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగింది. కాంగ్రెస్ దాదాపు 92 స్థానాల్లో పోటీచేస్తోంది. అయితే.. పశ్చిమ బెంగాల్‌లో శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ టీఎంసీతో పొత్తు పెట్టుకుంది. శివసేన మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ ఒంటరి అయింది. కాంగ్రెస్ గెలవడం కష్టం కాబట్టే తాము మమతకు మద్దతు ప్రకటించామని వీరు చెబుతున్నప్పటికీ మహారాష్ట్రలో కాంగ్రెస్ సహకారం లేకపోతే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఎక్కడన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మొత్తంగా మిత్రుత్వం అనేది ఒక రాష్ట్రానికే పరిమితమని.. మరో రాష్ట్రంలో ఎవరిష్టం వారిదే అన్నట్లుగా ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version