నటీనటులుః విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రూహీ సింగ్ తదితరులు
దర్శకత్వంః జెఫ్రీ గీ చిన్
నిర్మాణంః 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్
సంగీతంః సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీః షెల్డన్ చౌ
రిలీజ్ డేట్ః 19 మార్చి, 2021
Also Read: టాలీవుడ్ హీరోయిన్ హాట్ ఫోజ్
మంచు విష్ణు హీరోగా పరిచయమై దాదాపు 18 సంవత్సరాలు అవుతోంది. కానీ.. కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం.. ఢీ, దేనికైనా రెఢీ వంటి చిత్రాలు తప్ప మరేవీ కనిపించవు. ఫెయిల్యూర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి, సక్సెస్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు విష్ణు. ఇలాంటి పరిస్థితుల్లో రొటీన్ కు భిన్నంగా చేసిన చిత్రం ‘మోసగాళ్లు’. దాదాపు రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, మంచు వారబ్బాయిని ఇటు నిర్మాతగా, అటు హీరోగా ఏమేరకు గట్టెక్కించింది అనేది చూద్దాం.
కథః తల్లిదండ్రులకు ఎదురైన అవమానం భరించలేక.. నిజాయితీగా ఉండడం కన్నా, జనాలను మోసం చేయడమే కరెక్ట్ అని డిసైడ్ అవుతారు ముంబైకి చెందిన అక్క తమ్ముడు. ఈ క్రమంలో అమెరికాలోని తెలుగు వాళ్ల దగ్గర భారీగా డబ్బులు ఉంటాయని, వాళ్లను టార్గెట్ చేస్తారు అను(కాజల్), అర్జున్(విష్ణు). ఓ భారీ స్కాం చేసి, ఏకంగా రూ.4 వేల కోట్లు కొల్లగొడతారు. మరి, ఈ స్కాం నుంచి వాళ్లు బయటపడ్డారా? పోలీసులకు చిక్కారా? చివరకు ఏమైంది? అన్నది అసలు కథ.
కథనంః నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. గతంలో భారతీయ ఐటీ పరిశ్రమలోని ఓ కాల్ సెంటర్లో రూ.2,800 కోట్ల భారీ కుంభకోణం చోటు చేసుకుంది. దాని ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ముంబైలోని బస్తీలో నివసించేవారు అంత పెద్ద స్కాం ఎలా చేయగలిగారనే విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. సహజంగా.. థ్రిల్లర్ జోనర్ కాబట్టి ప్రేక్షకులను ఎగ్జయిట్ చేయడానికి కావాల్సినంత స్కోప్ ఉంటుంది. దీన్ని బాగానే ఉపయోగించుకున్న దర్శకుడు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. దర్శకుడు జెఫ్రీ గీ చిన్ హాలీవుడ్ కు చెందినవాడు కావడంతో హాలీవుడ్ రేంజ్ లోనే సినిమా తీశాడని చెప్పొచ్చు. విజువల్స్ మంచి రిచ్ గా ఉన్నాయి. సీరియస్ నోట్ లో హీరో విష్ను పాత్రను ఇంటెన్స్ గా మలచడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రధాన బలం క్లైమాక్స్. ఇది సాగుతున్నంత సేపు ఏం జరుగుతుందోనని ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు. అయితే.. దర్శకుడు తెలుగువాడు కాకపోవడమే కారణం కావొచ్చేమోగానీ.. తెలుగు నేటివిటీ ఈ సినిమాలో మిస్సవుతుంది. అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం కూడా దీనికి కారణం. పాటల్లో కూడా తెలుగుదనం పెద్దగా అగుపించదు. వెంకటేష్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యింది.
Also Read: హీరోగారి కొడుకు పేరు ‘కందన్’ !
పెర్ఫార్మెన్స్ః హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విష్ణు అద్భుతమైన రీతిలో నటించాడు. ఇక, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాజల్ గురించి. స్టార్ హీరోయిన్ గా ఉన్న కాజల్.. అక్కపాత్రలో నటిస్తోందనే సరికి క్యూరియాసిటీ పెరిగింది. అక్క పాత్రలో కాజల్ చక్కగా నటించింది. కన్నింగ్ క్యారెక్టర్లను అక్కాతమ్ముడు ఇద్దరూ ఓన్ చేసుకున్నారు. వీరిద్దరి యాక్టింగే సినిమాకు బలం. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అదనపు ఆకర్షణగా నిలిచారు. నవదీప్, నవీన్ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకం. ఈ విషయంలో సామ్ సీఎస్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది. సినిమాకు రిచ్ లుక్ తీసుకురావడంలో ఆయన పనితనం కనిపిస్తుంది. మొత్తంగా రొటీన్ కు భిన్నంగా, అద్దరిపోయే సస్పెన్స్ తో డిఫరెంట్ మూవీని అందించారని చెప్పొచ్చు. ఇక, ప్రేక్షకులు ఏ మేరకు కనెక్ట్ అవుతారన్నదే కీలకం.
బలాలుః విష్ణు-కాజల్ నటన, కథనం, దర్శకత్వ ప్రతిభ
బలహీనతలుః తెలుగు నేటివిటీ లేకపోవడం, పాటలు
లాస్ట్ లైన్ః ప్రేక్షకులను మోసం చేయలేదు!
రేటింగ్: 2.75
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్