Chandrababu- KCR: తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి.. రెండోసారి అధికారం నిలబెట్టుకోవడానికిమూల కారకుడు చంద్రబాబు.. మీరు చదవింది ముమ్మాటికీ నిజం. అదేంటీ..చంద్రబాబు ఏంటి? రాజకీయ బద్ద శత్రువుగా ఉన్న కేసీఆర్ అధికారంలోకి రావడానికి కారణం ఏమిటి? అనుకుంటున్నారు కదూ. చంద్రబాబును బూచీగా చూపే రెండుసార్లు తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చారు కేసీఆర్. సిట్యువేషన్లను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ కు మించిన ఘనాపాటి ఇంకోక నేత ఉండరు. సుదీర్ఘ కాలం తెలంగాణ పోరాటంలో కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ను గమనించి టీఆర్ఎస్ ను స్థాపించారు. తొలిసారిగా కాంగ్రెస్ తోనే జతకలిశారు. అటు తరువాత చంద్రబాబుతోనే ‘మహా కూటమి’ పేరిట జట్టు కట్టారు. వైఎస్ఆర్ కొట్టిన దెబ్బలకు తట్టుకొని టీఆర్ఎస్ ను నిలబెట్టారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని సోనియాగాంధీకి నమ్మబలికారు. అయితే ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పెరిగేసరికి ససేమిరా అన్నారు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చారు. మూడోసారి ముచ్చటగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పనిలోపనిగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశంపై దండెత్తడానికి సిద్ధమవుతున్నారు.

అయితే తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని కేసీఆర్ ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే దానికి చంద్రబాబు కూడా ఇతోధికంగా సాయం చేశారు. అభిమానించి కాదు కేసీఆర్ ను దూరం చేసుకొని అతడికో రాజకీయ మార్గాన్ని అయితే చూపించగలిగారు. అటు తరువాత చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని ముద్ర వేయడంలో కూడా కేసీఆర్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు వస్తే మరోసారి తెలంగాణ ఏపీ పాలకుల చేతిల్లోకి వెళ్లిపోతుందని తొలి ఎన్నికల్లో హెచ్చరించి బాగానే లబ్ధిపొందారు. రెండోసారి ఎన్నికల్లో కూడా మహా కూటమి పేరిట చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టేసరికి జాగ్రత్త పడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబునే బూచీగా చూపించారు. చంద్రబాబు వ్యతిరేక వైఖరిని తెలంగాణ ప్రజల్లో పతాక స్థాయిలో రగిల్చారు. మంచి ఫలితాన్ని దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా తన స్టేట్ లో వేలిపెడతవా? అంటూ కోపోద్రిక్తుడైన గులాబీ బాస్ రివేంజ్ పాలిట్రిక్స్ కు దిగారు. ఏపీలో జగన్ పార్టీకి ఎన్నోవిధాల సాయం చేసి చంద్రబాబు ఓటమికి తాను ఒక కారణమయ్యారు. అంటే చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకున్నందుకు కేసీఆర్ పుణ్యమా అని మూల్యం చెల్లించుకుంటూ వస్తున్నారన్న మాట.
ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో కూడా మరోసారి చంద్రబాబును తెరపైకి తెచ్చి కేసీఆర్ లబ్ధిపొందాలనుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. ప్రస్తుం అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంతోకొంత క్యాడర్ కలిగి ఉన్న చంద్రబాబు సహజంగానే బీజేపీకి సపోర్టు చేస్తారు. మద్దతు కూడా ప్రకటించారు. ఏపీలో ఆయన అవసరాలు ఆయనవి కాబట్టి. అయితే కేసీఆర్ తన పాత సహజ శైలినే మరోసారి బయటపెట్టారు. మళ్లీ తన జేబులో ఉన్న చంద్రబాబు ఆస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఆంధ్రా నాయకుడు ప్రచారంఏమిటని ఒక కాలం చెల్లిన లాజిక్ ను ఒకటి బయటకు తీశారు. కానీ అది వర్కవుట్ అయ్యే పరిస్థితులు లేవు. గత రెండు ఎన్నికల వరకూ అది పనిచేసినా.. చంద్రబాబు తమకు ద్రోహం చేశారన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

అయితే తాను జాతీయ పార్టీ ప్రకటించిన విషయాన్ని కేసీఆర్ మరిచిపోయినట్టున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పడి భారతీయ రాష్ట్ర సమితి విషయాన్ని కాస్తా పక్కనపెట్టినట్టున్నారు. మాది ఉద్యమ పార్టీ కాదు బీజేపీ నుంచి దేశాన్ని విముక్తి కలిగించే పార్టీగా చెప్పుకొచ్చారు. అంటే దేశంలోని అన్ని ప్రాంతాలు తమకు సమానమేనన్నవాదనను తెరపైకి తెచ్చారు. పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఏపీ ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలిగించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అదే ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం పాలించిన చంద్రబాబు తెలంగాణలో బీజేపీకి మద్దతు తెలిపితే తప్పు.. తమరు మాత్రం ఏపీలో పోటీచేయడానికి అర్హులా అంటూ గులాబీ బాస్ కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంటా బయట, సోషల్ మీడియాలో దీనిపైనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో చంద్రబాబును బూచీగా చూపిస్తే.. తరువాత తాను కలలు గంటున్న బీఆర్ఎస్ కు ప్రతిబంధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.