Telangana Elections 2023: ఎగ్జిట్ ఫలితం వచ్చేసింది. ఒక్కొక్క సంస్థ ఒక్క విధంగా చెప్పేసింది. కానీ అంతిమ ఫలితం బ్యాలెట్ బాక్సులలో నమోదయి ఉంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయం వరకు ఒక అంచనా అయితే వస్తుంది. ఇప్పటివరకు మెజారిటీ సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేశాయి. ఆ పార్టీ నాయకులు కూడా సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఇక్కడే కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. 50 సీట్లు కారు పార్టీకి రావద్దని ప్రార్థించాలి.. ఎందుకంటే కార్ పార్టీకి 50 సీట్లు వస్తే కెసిఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఆగడు. తన మిత్రపక్షమైన మజ్లిస్ తో కలిసి కాంగ్రెస్ స్థానాలను చీల్చి రెండవ మాటకు తావు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ భరోసా వల్లే భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రభుత్వం ఏర్పాటు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ కూడా ట్వీట్లు చేస్తోంది అందుకే. కెసిఆర్ కూడా నిన్న గెలుపు పై విశ్వాసం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులతో మంతనాలు జరిపారు. మనమే గెలుస్తున్నామని, అ ధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
గతంలో ఏం జరిగింది అంటే.
కిందటి సారి 28% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 46% ఓట్లు భారత రాష్ట్ర సమితికి వచ్చాయి. అయితే ఇప్పుడు 45 నుంచి 46 శాతం ఓట్లతో 70 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని కొన్ని సర్వేలు, 50 నుంచి 70 స్థానాలు సాధిస్తుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇంకొన్ని సర్వే సంస్థలు మాత్రం తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నాయి. అయితే ఇక్కడ భారత రాష్ట్ర సమితి 30 నుంచి 40 స్థానాల వరకు పరిమితమైపోతే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అనుమానం అనేదే లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ భారత రాష్ట్ర సమితి గనక 50 సీట్లు సాధిస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు మొదలవుతాయి. తన మిత్రపక్ష ఎంఐఎం తో కలిసి, కొన్ని కాంగ్రెస్ పార్టీ సీట్లను చీల్చీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం సర్వే సంస్థలు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. కెసిఆర్ కు ఎక్కడ 50 సీట్లు వస్తాయి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మదన పడుతున్నారు. అయితే కర్ణాటక వ్యవహారాలను డీకే శివకుమార్ పర్వవేక్షిస్తున్నందున గతంలో తన రాష్ట్రంలో పడిన ఇబ్బంది పార్టీ పడకూడదని భావించి.. ధ్రువీకరణ పత్రాలను తీసుకోగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కర్ణాటక తరలించాలని ఆయన ఒక ప్రపోజల్ రేవంత్ రెడ్డి ముందు పెట్టారు. దానికి రేవంత్ రెడ్డి ఓకే అన్నారు అని తెలిసింది. ఇందుకోసం ముందుగానే విమానాలను బుక్ కూడా చేశారని సమాచారం.
ఎగ్జిట్ పోల్స్ సర్వే తర్వాత..
ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలైన నేపథ్యంలో.. సర్వే సంస్థలు శాంపిల్స్ సేకరించడం మొదలుపెట్టాయి. సాయంత్రం నాలుగు గంటల దాకా అలా సేకరిస్తూనే ఉన్నాయి. పోలింగ్ అయిదు గంటలకు ముగిసిన నేపథ్యంలో అన్ని సంస్థలు కూడా తమ ఫలితాలను ప్రకటించాయి. అయితే ఇందులో మెజారిటీ సంస్థలు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాయి. అయితే సంస్థలు చెప్పే ఫలితం మీద ఒక అవగాహన ఉండటంతో భారత రాష్ట్ర సమితి ఉన్న ఆ కాస్త ఓట్లను కూడా చేజార్చుకోకూడదని భావించి ఓటుకు ఐదు నుంచి పదివేల చొప్పున పంపిణీ చేసి ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకొచ్చింది. అయితే చాలా చోట్ల పోలింగ్ రాత్రి 8:30 దాకా కొనసాగడంతో, ఆ ఓట్లు మొత్తం తమకే పడ్డాయని భారత రాష్ట్ర సమితి నాయకులు భావిస్తున్నారు.. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి నాయకుల దీమా కూడా ఇదేనేను పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఏమిటో తెలియాలంటే మరో కొద్దిగంటలు ఎదురు చూడాల్సిందే.