Arvind Kejriwal Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే.. జర్మనీ, అమెరికా ఎందుకు స్పందిస్తున్నాయి?

అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యు మిల్లర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించారు. "కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంతో పాటు ఇలాంటి చర్యలను తాము జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటామని" మిల్లర్ అన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 29, 2024 9:00 am

Arvind Kejriwal Arrest

Follow us on

Arvind Kejriwal Arrest: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఆయన కీలకపాత్ర పోషించారని, ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అరవింద్ అరెస్టు నేపథ్యంలో ఆప్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు.. ఇదంతా ఇలా జరుగుతుండగానే.. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ దేశాలు స్పందించాయి.

అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యు మిల్లర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించారు. “కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంతో పాటు ఇలాంటి చర్యలను తాము జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటామని” మిల్లర్ అన్నారు. “ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేస్తుందని మా దృష్టికి వచ్చింది. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయడం ఇబ్బందికరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కూడా మా దాకా వినవచ్చాయి. ఇందులోని ప్రతి అంశం గురించి పారదర్శకంగా, సకాలంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. అటువంటి చట్టపరమైన ప్రక్రియల వేగిరంలో మేము కృషి చేస్తామంటూ” మిల్లర్ ప్రకటించారు.

మిల్లర్ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ లోని అమెరికా దౌత్యవేత్త గ్లోరియా బార్బెనా కు భారత్ సమన్లు జారీ చేసింది. దీనిపై మిల్లర్ స్పందించారు. “ఇక్కడ నేను ప్రైవేట్ వ్యవహారాల గురించి మాట్లాడటం లేదు. ఆ దేశంలో జరుగుతున్న విషయాలను నేను ప్రస్తావించాను. చట్టపరమైన ప్రక్రియలను ప్రోత్సహించేందుకు మా వంతు సహాయం చేస్తామని చెబుతున్నామని” మిల్లర్ అన్నారు. మిల్లర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త ఎదుట భారత్ తన వాదన వినిపించింది. దీనికి సంబంధించి గంటకు పైగా సమావేశం జరిగింది.

మరోవైపు అరవింద్ కేజ్రివాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ని.. కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన సమాధానాలు చెప్పడానికి నిరాకరించారు..”అరెస్టుపై ఇప్పటికే మేము స్పందించాం. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఆ వివరాలు బయటకు చెప్పడం సాధ్యం కాదు. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు అమలవుతున్నాయి. అక్కడ పౌరులకు స్వేచ్ఛ లభిస్తోంది. భారతదేశంలో మేము వ్యూహాత్మక వ్యాపార భాగస్వామిగా ఉన్నాం. భారతదేశం విలువలకు కట్టుబడి ఉంటుందని మేము నమ్ముతున్నామని” జర్మనీ విదేశాంగ ప్రతినిధి ప్రకటించారు. జర్మనీ విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దేశ ఎంబసీ డిప్యూటీ చీఫ్ జార్జ్ ఎన్జ్వీలర్ కు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది

అటు అమెరికా, ఇటు జర్మనీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై రెండు దేశాల విదేశాంగ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ నిరసన వ్యక్తం చేసింది.”ఒక దేశ దౌత్య నీతిలో మరో దేశం తలదూర్చడం సరికాదు. అంతర్గత వ్యవహారాలను కచ్చితంగా గౌరవించాలి. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. కచ్చితంగా ఇక్కడ అన్ని హక్కులు అమలవుతుంటాయి. అనేక ప్రజాస్వామ్య ప్రక్రియలు కొనసాగుతుంటాయి. ఇక్కడి న్యాయ వ్యవస్థ కూడా చాలా దృఢమైనది. అందులో అను నిర్ణయాలు నిబంధనలకు లోబడే జరుగుతుంటాయి. వీటన్నింటినీ కొన్ని దేశాలు ప్రశ్నించడం దురదృష్టకరమని” భారతదేశ విదేశాంగ శాఖ ప్రకటించింది..భారత విదేశాంగ శాఖ ప్రకటన తర్వాత జర్మనీ కాస్త వెనక్కి తగ్గింది. భారతదేశంలో పరస్పర సహకారంతో పనిచేస్తామని.. దీని కోసం మేము ఆసక్తిగా ఉన్నామని ప్రకటించింది.