https://oktelugu.com/

Cyber Frauds: మీ బ్యాంకు ఖాతా భద్రమేనా?

సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో.. దాని ఆధారంగానే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్ లు పెట్టి, స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ల రూపంలో అమాయకులకు వల విసురుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 29, 2024 9:06 am
    Cyber Frauds

    Cyber Frauds

    Follow us on

    Cyber Frauds: అభిమన్యుడు సినిమా చూశారా.. అందులో హీరో విశాల్ బ్యాంకు ఖాతాలో డబ్బులను అతనికి తెలియకుండానే సైబర్ ముఠా లాగేస్తుంది. దీంతో అతడు రంగంలోకి దిగి అసలు విషయాలు తెలుసుకునేసరికి మైండ్ బ్లాంక్ అవుతుంది.. సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోను సైబర్ ముఠా అంతకు మించి అనేలాగా తెగిస్తోంది. దీనివల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గతంలో స్మార్ట్ ఫోన్ లకు లింక్స్ పెట్టి జనాలను అడ్డగోలుగా దోచుకున్న సైబర్ ముఠా.. ఇప్పుడు కొత్తదారిలో దోపిడీ చేస్తోంది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇటీవల కొంతమంది సైబర్ ముఠాగాళ్లు ఏకంగా బ్యాంకు ఖాతాల వివరాలను విదేశాలకు పంపిస్తున్నారు.

    సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో.. దాని ఆధారంగానే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్ లు పెట్టి, స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ల రూపంలో అమాయకులకు వల విసురుతున్నారు. మాయ మాటలు చెప్పి కమీషన్ల ఆశ చూపుతున్నారు. వారిద్వారా బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలను విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. ఇటువంటి నేరాలు ఇటీవల పెరిగిపోయాయి. ఈ తరహా నేరాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఆ నిందితులు చెప్పిన వివరాలు పోలీసులను షాక్ కు గురిచేశాయి.

    సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. వాటి ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ను పరిచయం చేస్తున్నారు. ఇందులో ప్రవేశిస్తే కమీషన్ ఇస్తామని ఆశలు కల్పిస్తున్నారు. అనంతరం వారిద్వారా ఖాతాలు సేకరించి విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు.

    సైబర్ నేరగాళ్ళు తప్పుడు ఫోన్ నెంబర్లతో మెసేజ్ లు పంపుతుంటారు. స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన సమాచారాన్ని వారికి లింక్స్ రూపంలో పంపుతారు. ఒకవేళ వారు క్లిక్ చేస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కినట్టే. అలాంటి వారి ద్వారా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తారు. అందుకు గానూ మధ్యవర్తులకు కొంత డబ్బు ఇస్తారు. నమ్మకం కుదిరిన తర్వాత.. వారితో ఎక్కువగా ఇలాంటి పనులు చేయిస్తుంటారు. ఇలా ఖాతాలను విదేశాల్లోని సైబర్ ముఠాలకు అమ్మిన తర్వాత ఇక్కడి వారి పని పూర్తవుతుంది. ఇక విదేశాల్లోని సైబర్ ముఠా అమాయకులైన ప్రజలను దోచుకోవడమే ఏజెండాగా పనిచేస్తుంది. ఈ సైబర్ ముఠా చైనా, కంబోడియా దేశం నుంచి పని చేస్తోందని తెలుస్తోంది. వీరు రకరకాల ఆశలు కల్పించి.. ఖాతాదారులను దోచేస్తున్నారు. ముందుగానే మధ్యవర్తుల ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు తెలుసుకొని.. ఖాతాదారులకు తెలియకుండానే వారి డబ్బులను మొత్తం ఖాళీ చేస్తుంటారు. ఈ తరహా కేసులు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. అయితే ఇలాంటి మోసగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.