Amrapali Kata
Amrapali Kata: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికారం మార్చారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దించి.. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ముందుండి నడిపించిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే పాలనతో రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రమాణం చేసిన సాయంత్రమే కేబినెట్ భేటీ నిర్వహించారు. ఇంటలిజెన్స్ అధికారిని మార్చారు. సీఎంవో సెక్రెటరీగా శేషాద్రిని నియమించుకున్నారు. తాజాగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఇప్పుడు ఐఏఎస్‌ల వంతు వచ్చింది. మొదట సీఎంవో నుంచే మార్పు ప్రారంభిస్తారని తెలుస్తోంది.
ప్రభుత్వాలు మారితే అంతే..
ప్రభుత్వం మారితే పథకాల పేర్లు, పరిస్థితులే కాదు అధికారులు కూడా ఛేంజ్ అయిపోతారు. సీఎం ఆఫీసులో అధికారుల టీమ్ అంతా మారిపోవడం కామన్. అయితే, ప్రస్తుతం తెలంగాణలో స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మొన్నటివరకు కేసీఆర్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి రేవంత్‌రెడ్డి టీమ్ లో జాయిన్ అవుతారని సమాచారం.
స్మితా సబర్వాల్‌ను కోరి తెచ్చుకున్న కేసీఆర్..
ఐఏఎస్ అధికారిæ స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని అప్పటి సీఎం కేసీఆర్ ఏరికోరి ఆమెను సీఎంవో కార్యదర్శిగా నియమించారు. నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతోపాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు.
కొత్తటీంపై సీఎం దృష్టి..
సీఎం రేవంత్‌రెడ్డి కొత్త టీమ్ మెల్లమెల్లగా సిద్ధమవుతోంది. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులు అంతా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ, స్మితా సబర్వాల్ మాత్రం ఇంతవరకు సీఎం రేవంత్ ను కలవలేదు. తన భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. తాను కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.
ఆమె స్థానంలో ఆమ్రాపాలి..
స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీసులోకి ఐఏఎస్ అధికారిæ ఆమ్రపాలి ఎంట్రీ ఇస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్ర సర్వీస్ ముగించుకుని తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలి సీఎం రేవంత్ ను కలిశారు. శుభాకాంక్షలు సైతం తెలిపారు. దీంతో ఆమెకు సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు కన్‌ఫామ్ అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి తెలంగాణలో పలు జిల్లాలలో కలెక్టర్‌గా పని చేశారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరిన ఆమ్రపాలి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసి డైనమిక్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్‌గా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రధానమంత్రి కార్యాలయంలో..
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా అమ్రాపాలి విధులు నిర్వహించారు. ఆ తర్వాత ప్రధాని కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి చిన్న వయసులోనే ఈ పదవిలో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. పీఎంవో కార్యాలయంలో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు సుమారుగా మూడేళ్ల పాటు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి మళ్లీ తెలంగాణకు వచ్చారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ias transfers at any moment key post for amrapali
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com