IAS Officer Pooja Khedkar: మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ బాగోతాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎస్ ఉద్యోగంలో చేరేందుకు పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తండ్రి కూడా రిటైర్డ్ ఐఏఎస్ అని.. కోట్లలో ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్‌తోపాటు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి ఉద్యోగంలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పూజా ఖేద్కర్ మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
ప్రభుత్వానికే డిమాండ్లు..
ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన పూజ పూణె అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఈ సమయంలో ఆమె పెట్టిన డిమాండ్లు చూపి మహారాష్ట్ర ప్రభుత్వమే షాక్ అయింది. వెంటనే ఆమెను వాసిమ్ జిల్లాకు బదిలీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి.
అనారోగ్య సమస్యలు చూపి..
ఇక 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పూజ ఖేద్కర్.. తనకు కంటి, మానసిక సమస్యలు ఉన్నట్లు ఉద్యోగంలో చేరే సమయంలో అఫిడవిట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యలపై మెడికల్ టెస్టులు చేసేందుకు అధికారులు పిలవగా ఆరుసార్లు గైర్హాజరై తప్పుంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2022 ఏప్రిల్‌లో మొదటిసారి ఢిల్లీ ఎయిమ్స్‌లో మెడికల్ టెస్టుకు అధికారులు పిలవగా కొవిడ్ పాజిటివ్ వచ్చిందని వెళ్లలేదు. తర్వాత కూడా కొన్ని నెలలపాటు మెడికల్ టెస్టులకు హాజరు కాలేదు. ఆరోసారి హాజరైనా పూర్తి టెస్టులు చేయించుకోలేదు. కంటి సమస్యలకు సంబంధించి కీలకమైన ఎంఆర్‌ఐ పరీక్షకు పూజా ఖేద్కర్ హాజరుకాలేదు.
ఏదో ఒకరకంగా శిక్షణ పూర్తి..
ఇక పూజ సివిల్ సర్వీసెస్ శిక్షణను కూడా ఇలాగే మేనేజ్ చేస్తూ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్ ఎంపికను.. కమిషన్ ట్రైబ్యూనల్‌లో సవాలు చేశారు. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు కూడా వచ్చింది. అయినా.. పూజా ఖేద్కర్ ఐఏఎస్‌గా ట్రైనింగ్ పొందడం గమనార్హం.
ఓబీసీ ధ్రవీకరణపై వివాదం..
మరోవైపు పూజా ఖేద్కర్ ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలు ముసురుకున్నాయి. ఆమె తండ్రి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని.. ఆయనకు రూ.40 కోట్ల విలువైన ఆస్తులు (మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకుపైనే ) ఉన్నాయి. అయినా ఆమెకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్టిఫికేట్ కారణంగానే ఆమెకు సివిల్స్‌లో 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదా పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అనుమతి లేకుండా ఆడీ కారు..
ఇక పూణె అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్న ప్రొబేషనరీ ఐఏఎస్ అయిన పూజా ఖేద్కర్.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఆడీ కారు వినియోగించింది. అంతేకాకుండా ఆ కారుకు రెడ్–బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ ప్లేటు పెట్టుకున్నారు. కారుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ కూడా వేసుకున్నారు. అంతటితో ఆగకుండా తనకు వీఐపీ వసతి సౌకర్యాలు కావాలని.. తనకు అధికారిక ఛాంబర్ కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఆయన గదిని కూడా ఆక్రమించుకున్నారు. పూజా ఖేద్కర్ వ్యవహారం తీవ్రం కావడంతో పూణే కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే.. మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పూణే జిల్లా నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉంటారని ఉత్తర్వులు జారీ చేశారు.
ఆడి కారుపై రూ. 27 వేల చలాన్..
ఇక పూణె అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో పూజా వాడిక ఆడి కారుపై రూ.27 వేల ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అనధికారికంగా బీకాన్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వ గుర్తును ఉపయోగించినట్లు గుర్తించిన ప్రైవేట్ యాజమాన్యంలోని లగ్జరీ కారుపై నోటీసు జారీ చేశారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కంపెనీ పేరుతో రిజిస్టరైన ఆడి కారులో 21 చలాన్లు, మొత్తం కాంపౌండింగ్ ఛార్జీలు రూ.27,000లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
చర్యలకు సిద్ధమైన ట్రాఫిక్ పోలీసులు..
పూణే సిటీ పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ బ్రాంచ్‌కు చెందిన బృందం బీకాన్, చిహ్నాలను ఉపయోగించిన ఆడి కారుపై చర్య తీసుకోవడానికి బ్యానర్‌లోని పూజ ఇంటికి వెళ్లారు. రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ ఖేద్కర్ స్పందించలేదు. పోలీసులు, జర్నలిస్టులు పదే పదే డోర్ బెల్ మోగించారు, గేట్ కొట్టారు. గార్డు కోసం పిలిచారు, కానీ ఎటువంటి స్పందన లేదు. ఇక ఇంటి ఆవరణలో ఆడికారును మరో నాలుగు కార్ల మద్య నిలిపి కనిపించకుండా కప్పి ఉంచడం గమనార్హం. దీంతో నోటీసులను పూజ ఇంటికి అంటించారు. ‘ప్రైవేట్ యాజమాన్యంలోని ఆడి కారుపై బీకాన్, మహారాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఉపయోగించినట్లు ఈ నోటీసు ద్వారా మీకు తెలియజేయబడుతోంది. దీని ఆధారంగా మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం వాహనంపై చర్య తీసుకోబడింది. గతంలో విధించిన చలాన్ కూడా చెల్లించలేదు. తదుపరి చట్టపరమైన చర్య కోసం కారును చతుశృంగి ట్రాఫిక్ విభాగానికి సమర్పించాలి’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.