Adani : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 18 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో చదివిన ఈ బాలిక జేఈఈ మెయిన్స్‌లో తక్కువ మార్కులు రావడం వల్లే ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. దేశంలోని మూడవ అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ చైర్మన్, ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆశల భారంతో చేతికి అంది వచ్చిన కూతురు వెళ్లిపోవడం హృదయ విదారకంగా ఉందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. జీవితం పరీక్షల కన్నా గొప్పదని, జీవితం ఎల్లప్పుడూ రెండవ అవకాశాన్ని ఇస్తుందని అదానీ అన్నారు.
‘చిట్టి తల్లి అంచనాల భారంతో ఇలా వెళ్లిపోయడం హృదయవిదారకం. జీవితం అన్ని పరీక్షల కన్నా గొప్పది. తల్లిదండ్రులు దీనిని అర్థం చేసుకోవాలి. వారి పిల్లలకు కూడా వివరించాలి. నేను చదువులో యావరేజ్. నేను చదువులోనూ, జీవితంలోనూ చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. కానీ ప్రతిసారీ జీవితం నాకు కొత్త మార్గాన్ని చూపించింది. మీ అందరికీ నా అభ్యర్థన ఏమిటంటే.. ఫెయిల్యూర్ ను మీ చివరి గమ్యస్థానంగా ఎప్పుడూ భావించకండి. ఎందుకంటే జీవితం ఎప్పుడూ రెండో అవకాశం ఇస్తుంది.’’ అని అదానీ చెప్పుకొచ్చారు.
"Life is bigger than any exam": Gautam Adani urges students to look beyond exams after JEE failure suicide
Read @ANI Story |https://t.co/o4JXOWnJz3#GautamAdani #JEEStudent #gorakhpur #suicide pic.twitter.com/fCQBr4rjku
— ANI Digital (@ani_digital) February 13, 2025
ఆత్మహత్య చేసుకున్న 12వ తరగతి విద్యార్థిని తన తల్లిదండ్రులకు ఓ లేఖ రాసింది. ఇందులో తను తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి, ‘క్షమించండి అమ్మా నాన్న.. దయచేసి నన్ను క్షమించండి. నేను రాలేకపోయాను. మన ప్రయాణం ఇక్కడ ముగుస్తుంది. ఏడవకండి. మీరిద్దరూ నాకు చాలా ప్రేమ ఇచ్చారు. నేను మీ కలలను నెరవేర్చలేకపోయాను. నేను చాలా ప్రయత్నించాను, కానీ చేయలేకపోయాను. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, నేను ఇప్పుడు అలసిపోయాను, శాంతిని కోరుకుంటున్నాను.’ అంటూ రాసుకొచ్చింది.
గోరఖ్‌పూర్‌లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ-మెయిన్)లో ఫెయిల్ అయినందుకు ఇంటర్మీడియట్ విద్యార్థిని అదితి మిశ్రా (18) ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, బెట్టియాహటలోని బాలికల హాస్టల్ గదిలో ఒక విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో ఫెయిల్ అయినందుకు బాధపడ్డానని ఆత్మహత్య చేసుకుంటున్నానని తను రాసిన లేఖ గదిలో దొరికింది. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో అదానీ పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సంరక్షకులకు సలహా ఇచ్చారు. అదితి బెట్టియాహటలోని బాలికల హాస్టల్‌లోని గది నంబర్ 86లో నివసించేది. హాస్టల్‌లో మొత్తం 12-13 గదులు ఉన్నాయి. దాదాపు 25 మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. అదితి మరణంతో అక్కడ నివసిస్తున్న విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.