Revanth Reddy VS KCR
Revanth Reddy VS KCR : అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరినప్పటికీ కెసిఆర్ బయటికి రాలేదు. అయితే ఇటీవల తన వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులతో కెసిఆర్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో నేను కొడితే మామూలుగా ఉండదని.. నాకు మామూలుగా కొట్టే అలవాటు లేదని కెసిఆర్ అన్నారు. దీనిని భారత రాష్ట్రపతి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసింది. తన అనుకూల మీడియాలో బొంబాట్ గా ప్రచురించింది. ఆ తర్వాత కెసిఆర్ మళ్లీ కనిపించలేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈనెల 19న తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ బయటికి వస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్ అవుతారని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి 0 సీట్లు వచ్చాయి. దీంతో ఆయన అప్పటినుంచి బయటికి రాలేదు. అయితే ఇటీవల గజ్వేల్ నాయకులతో సమావేశమైనప్పటికీ.. కెసిఆర్ తనకు అలవాటైన తీరులో మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న తెలంగాణ భవన్ కు రావాలని కార్యవర్గ సభ్యులకు సమాచారం అందించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పై ఆరోజు కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. అదే రోజు పలు కీలక నిర్ణయాలను వెల్లడిస్తారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
భారత రాష్ట్ర సమితి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రచారం మరింత తీవ్రంగా జరిగితే భారత రాష్ట్ర సంతికి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. మరో వైపు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో ఇటీవల కుండ బద్దలు కొట్టారు. తాము ఓటర్ల నమోదులో పాల్గొనలేదని.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల తాము నిరాశ చెందామని స్పష్టం చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో పార్టీకి తీవ్ర ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. అయితే ఈ పరిణామాలు మరింత తీవ్ర రూపు దాల్చితే స్థానిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి మరింత ఇబ్బందులు తప్పవు. అందుకే దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదే రోజు సమావేశంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యూహాత్మకంగా విమర్శలు చేస్తారని తెలుస్తోంది.
వారానికోసారి కలుస్తున్నారు
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ పెద్దగా నేతలను కలిసింది లేదు. తనకు అవసరం అనుకుంటేనే నేతలను పిలిపించుకునేవారు. అంతే తప్ప అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు రావడంతో.. కెసిఆర్ మనసు మార్చుకున్నారని.. ఇప్పుడు వారానికి ఒకసారి అయినా పార్టీ నేతలను కలుస్తున్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడు కేసీఆర్ కొన్ని కీలక ప్రకటనలు కూడా చేస్తున్నారు. త్వరలో గజ్వేల్ ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక ఎన్నికలకు ప్రకటన వస్తే.. ఆ సభ నిర్వహించడానికి భారత రాష్ట్ర సమితి రంగం సిద్ధం చేసుకుంటున్నది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్థానిక ఎన్నికలపై ఇంకా ఒక స్పష్టత ఇవ్వలేదు. కార్యవర్గ సమావేశం అనంతరం కెసిఆర్ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? ఎప్పటిలాగానే వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అవుతారా? అనేది పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు.