Mohan Babu- BJP: విలక్షణ నటుడు మోహన్ బాబు ఏది చేసినా విలక్షణమే. అతి చేయడంలోనూ కూడా అంతే. సినిమా వేదికల్లో అయినా.. మీడియా సమావేశంలో అయినా అతిగా మాట్లాడడం ఆయన నైజం. ఇక కుటుంబసభ్యల గురించి చెప్పనక్కర్లేదు. నోరు తెరిస్తే నాన్నగారు ఇది.. నాన్నగారు అది. ఆహా ఓ హో అంటూ కుమారుడు విష్ణు, కుమార్తె లక్మీలు ఊదే బాక నెటిజెన్లకు తెగ వినోదం పంచేది. వారిపై నడిచే ఫన్నీ కామెంట్స్ అన్నీఇన్నీకావు. అయితే ఈ విషయంలో చిన్న కుమారుడు మనోజ్ కు మినహాయింపు లభించింది. అయితే మోహన్ బాబు తాను ఒక నటుడిగా, మహా నటుడిగా, జాతీయ స్థాయి నటుడిగా అభివర్ణించుకుంటారు. కాదు బిల్డప్ ఇచ్చుకుంటారు.
ఒకానొక సమయంలో అక్కినేని నాగేశ్వరరావు కంటే నేనే మంచి నటుడని.. ఆ విషయం ఆయన భార్య అన్నపూర్ణగారే చెప్పారంటూ చనిపోయిన ఆమెను సాక్షంగా పెట్టారు. సినిమా రంగంలో తానో పెద్దన్నగా తనను తానే బిల్డప్ ఇచ్చుకుంటారు. చిరంజీవి నేను స్నేహితులమని.. ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశామని.. నాకంటే చిరంజీవి ఏంటి గొప్ప అని కూడా ప్రశ్నించిన సందర్భాలున్నాయి. అదే సమయంలో ద్వేషించిన ఉదంతాలు, పొడిగిన ఘటనలు.. ఇలా ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడతారో తెలియని స్థితిలో మోహన్ బాబు ఉంటారు. ఒకసారి తనకు జీవితమిచ్చింది దాసరి నారాయణరావు అని చెబుతారు.
మరోసారి అన్న ఎన్టీఆర్ లేకుంటే తాను లేనని వ్యాఖ్యానిస్తుంటారు. ఇలా ఒకటేమిటి సినీ పెద్దల పేర్లు ప్రస్తావిస్తుంటారు. రజనీకాంత్ ను సినిమా ప్రముఖుల సమక్షంలోనే అరేయ్.. ఒరేయ్ అంటూ వ్యాఖ్యానించారు. దానిని సాక్షాత్ మెగాస్టార్ చిరంజీవి తప్పుపట్టారు. అరేయ్.. ఒరేయ్ అనవద్దని కూడా సూచించారు. కానీ మోహన్ బాబు తగ్గలేదు. తనకు తాను క్రమశిక్షణవాదిగా అభివర్ణించుకునే మోహన్ బాబు చేసిన ఆ అతే పిల్లలకు అబ్బిందన్న వ్యాఖ్యలు సిని వర్గాల్లో వినిపిస్తుంటాయి. విలక్షణ నటుడిగా మోహన్ బాబు ఎంత గుర్తింపు దక్కించుకున్నా.. పిల్లలకు మాత్రం ఆ స్థాయిలో గుర్తింపు దక్క లేదన్నది వాస్తవం. కానీ అది గుర్తెరగకుండా ఎప్పుడో 90లో మోహన్ బాబు విజయాలనే ఇప్పటికీ మంచు కుటుంబసభ్యులు ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
పొంతన లేని ప్రకటనలు..
ఇక రాజకీయాల విషయానికి వస్తే మోహన్ బాబు ఎప్పుడు ఏ ప్రకటన చేస్తారో తెలియదు. అసలు ఆయనకు ఏ పార్టీ సభ్యత్వం లేదు. కానీ తాను ఒకసారి వైసీపీ వాదినని చెబుతారు. మరోసారి బీజేపీ సానుభూతిపరుడునని మాట మార్చుతారు. తాజాగా తాను బీజేపీ వ్యక్తినంటూ అభివర్ణించుకున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సంతోషించే మొదటి వ్యక్తిని తానేనంటూ చెప్పుకున్నారు. గతంలో ఓ సారి కుటుంబసభ్యలుతో ప్రధాని మోదీని మోహన్ బాబు కుటుంబసభ్యులు కలిశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతటితో ఆగకుండా ప్రధానితో భోజనం చేసి దేశం, రాష్ట్రం విషయాలను చర్చించినట్టు కూడా చెప్పుకున్నారు. గడిచిన ఎన్నికలో వైసీపీకి బాహటంగానే మద్దతు తెలిపారు. ఇదేంటి అంటే జగన్ తనకు దగ్గర బంధువని చెప్పుకొచ్చారు. నా పెద్ద కుమారుడు విష్ణుకు స్వయాన బావ అని కూడా ప్రకటించుకున్నారు. గత ఎన్నికల్లో ఊరూ వాడ తిరిగి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. చంద్రబాబును గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చివరకు లోకేష్ బరిలో నిలిచిన మంగళగిరిలో సైతం ప్రచారం చేశారు. అయితే తన కొడుకు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడినప్పుడు అదే లోకేష్ మామ నందమూరి బాలక్రిష్ణ మద్దతును అభ్యర్థించారు. అంతటితో ఆగకుండా అల్లుడు లోకేష్ విషయంలో తాను చేసిన పొరపాటును చూసి కూడా బాలక్రిష్ణ విష్ణుకు మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. అసలు మోహన్ బాబు చెప్పేదానికి చేసే పనులకు అసలు పొంతన ఉండదు.
ఆశించిన స్థానం దక్కక..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబు రాజకీయంగా ఎదగాలని భావించారు. టీటీడీ చైర్మన్. లేకుంటే రాజ్యసభ స్థానమైనా ఇవ్వాలని జగన్ ను కోరారు. బంధువు, ఆపై వైసీపీకి ప్రచారం చేశాను కదా.. ఎందుకు పదవి ఇవ్వరని గట్టి నమ్మకంతో ఉండేవారు. కానీ మోహన్ బాబు వ్యవహార శైలిని గమనించిన జగన్ సైడ్ చేశారు. ఎటువంటి భరోసా ఇవ్వలేదు. దీంతో లోలోపల మదనపడిపోయారు. అటు చంద్రబాబు విషయంలో కూడా మోహన్ బాబు అమానుషంగా ప్రవర్తించారు. అందుకే ఆయనకు సమర్థిస్తూ వ్యాఖ్యానాలు చేయలేదు. ఎందుకొచ్చింది గొడవ అంటూ ఇప్పడు బీజేపీ నాది.. నేను బీజేపీ మనిషిని…దేశానికి మంచి జరగాలంటే బీజేపీ రావాలి అంటూ రకరకాల మాటలు చెబుతున్నారు.
Also Read:Pawan Kalyan Alliance With TDP: టీడీపీ విషయంలో పవన్ కళ్యాణ్ బెట్టు అందుకే?