
మోడీ, అమిత్ షా.. వీరిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అందులో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఈ రోజు బీజేపీకి అంత పేరు వచ్చిందన్నా.. బీజేపీ రెండుసార్లు అధికారంలో ఉందన్నా వీరి కృషి వల్లే. అసలు బీజేపీకి జవసత్వాలు అందించిన వాజ్ పేయి, అద్వానీలను పార్టీ ఏనాడో మరిచిపోయింది. అద్వానీ రథయాత్ర ద్వారా, వాజ్ పేయి పాలన ద్వారా బీజేపీకి దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజం వేశారు. దాని ఫలితం 2014లో దక్కింది. అప్పటికే పదేళ్లపాటు కాంగ్రెస్ పాలనను చూసి విసిగిపోయిన ప్రజలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ప్రధానిగా వస్తారంటే చప్పట్లతో స్వాగతం చెప్పారు.
Also Read: కంచుకోటకు బీటలు.. చంద్రబాబుకు ఏం మిగిలింది?
ఇక అప్పటి నుంచి బీజేపీ వెనుతిరిగి చూసుకోలేదు. 2014 నుంచి ఎన్నో రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది బీజేపీ. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితం చేయగలిగింది. ప్రతీ రాష్ట్రంలోనూ కాషాయ జెండా రెపరెపలాడటంతో ఇదంతా మోడీ, షా చలవ వల్లనే అన్నది క్యాడర్ బలమైన నమ్మకం. వారి వల్లనే పార్టీని దేశ వ్యాప్తంగా విస్తృతం చేయగలిగామని సంఘ్ పరివార్ సైతం నమ్ముతోంది. ఇంకా చాలా రాష్ట్రాలపై కన్నేసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేశారు.
ఇదిలా ఉండగా.. రానురాను ఈ ఇద్దరి కారణంగానే పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోవడమూ ఖాయమన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎక్కడా ఎగరకపోవచ్చనేది స్పష్టం అవుతోంది. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్‌లకు జరిగే ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు అంత సులువు కాదు. ఇప్పటికే గుజరాత్, యూపీల్లో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Also Read: ఆ ఆరు పదవులూ వైసీపీవే..
రానున్న కాలంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీ, షాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. దీనికి కారణం వీరి నిర్ణయాలు ఏకపక్షంగా ఉండటమే. మిత్రులు సైతం ఒక్కొక్కరుగా దూరం అవుతూనే ఉన్నారు. అటు అగ్రి బిల్లులు తెచ్చిన క్రమంలోనూ మరికొన్ని పార్టీలు వీడిపోయాయి. ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి పారిశ్రామిక వేత్తలకు ఈ గుజరాతీ నేతలు ఉపయోగపడుతున్నారన్న విమర్శలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఈ ఇద్దరి వల్ల ఇప్పటివరకు బీజేపీకి ఎంత వరకు హైప్ వచ్చిందో.. ఇప్పుడు ఆ ఇద్దరి వల్లే పార్టీ దిగజారిపోయే ప్రమాదం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్