https://oktelugu.com/

హైదరా‘బాధ’: ఎవ్వరినీ పలకరించినా కన్నీటి వరదే.!

‘‘మూడు  రోజులుగా నీళ్లల్లో  బిక్కు  బిక్కు మంటున్నాం.. కనీసం తాగుదామంటే నీళ్లు లేవు.. బుక్కెడు కూడు పెట్టేవాళ్లు లేరు…కంటి మీద కునుకు లేదు.. మమ్మల్ని చావమంటారా.. బతకమంటారా..” అని హైదరాబాద్  వరద  బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మంగళవారం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ జన జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది.  ఎవరినీ పలకరించినా కన్నీళ్ల సుడులే దర్శనమిస్తున్నాయి.  గూడు చెదిరినా బీదబిక్కి జనాలు తమను ఆదుకోవడానికి ఎవరైనా రాకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2020 / 12:21 PM IST
    Follow us on

    ‘‘మూడు  రోజులుగా నీళ్లల్లో  బిక్కు  బిక్కు మంటున్నాం.. కనీసం తాగుదామంటే నీళ్లు లేవు.. బుక్కెడు కూడు పెట్టేవాళ్లు లేరు…కంటి మీద కునుకు లేదు.. మమ్మల్ని చావమంటారా.. బతకమంటారా..” అని హైదరాబాద్  వరద  బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మంగళవారం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ జన జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది.  ఎవరినీ పలకరించినా కన్నీళ్ల సుడులే దర్శనమిస్తున్నాయి.  గూడు చెదిరినా బీదబిక్కి జనాలు తమను ఆదుకోవడానికి ఎవరైనా రాకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

    Also Read: పూల సింగిడి.. తెలంగాణలో నేడే పూల పండుగ

    వర్షం  వెలిసి  రెండు రోజులైనా నగరంలోని అనేక కాలనీల్లో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. 800కాలనీలకు పైగా నీళ్లలోనే ఉన్నాయి.  కరెంట్ సరఫరా పునురద్ధరణ కాలేదు.  కొన్ని చోట్ల జనాలకు ఇంటి లోపలికి వెళ్లే దారిలేక డాబాలపైన, స్లాబ్ ల పైనే  తల దాచుకుంటున్నారు.  కొన్ని కాలనీల్లో వరద తగ్గినా బురద ఇబ్బంది పెడుతోంది. చాదర్ ఘాట్ లో మూసీ నది పరిసర కాలనీల్లో రోడ్లు, ఇండ్ల లోపల కొండలా వ్యర్థాలు పేరుకపోయాయి. ఎటు చూసినా బురదే కనపడుతోంది. దీన్ని తొలగించడం పెద్ద సవాల్ తో కూడుకున్న పనే..

    మూడు రోజులుగా వరదలో ఉన్న  ఉప్పుగూడ, శివాజీ నగర్, ఛత్రినాక, జంగం మేట్ ప్రాంతాలకు బాలాపూర్ చెరువు గండి  కొట్టడంతో మళ్లీ ప్రవాహం పోటెత్తింది.  ఈ కాలనీ వాసులు ఆకలితో అలమటించి.. ప్రభుత్వ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే అందిస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారట..  తాము ఆకలితో పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా ప్రాంతాల్లోనూ బాధితులకు సాయం దక్కలేదు. మూసీ పరిసర ప్రాంతాలైన ఓల్డ్  మలక్ పేటలోని శంకర్ నగర్, మూసా నగర్, కమలానగర్,  వినాయక్ నగర్,  అఫ్జల్  నగర్, పద్మా నగర్ లో బురద పేరుకపోయింది. అయితే ఈ కాలనీలను గురువారం పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే బలాల జీహెచ్ఎంసీ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉప్పల్ రామంతాపూర్ చెరువు వెనుక ఉన్న  కాలనీలు, నల్ల చెరువు సమీప కావేరి నగర్, శ్రీగిరి కాలనీ, శ్రీనగర్ కాలనీ, న్యూ భరత్ నగర్, సౌత్ స్వరూప్ నగర్, మల్లికార్జున నగర్, ధర్మపురి కాలనీల్లోనూ అదే పరిస్థితి. కాటేదాన్ సమీప ఆలీ నగర్ లోని వెయ్యి ఇండ్లను జల్ పల్లి పెద్ద చెరువు , పల్లె చెరువు నీరు ముంచేసింది. 10 అడుగుల మేర నీరు చేరింది. 10 అడుగుల మేర నీరు చేరడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఇప్పటికే 2000మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి పోయారు. మిగిలిన వారు మొదటి అంతస్తులోనే, డాబాలపైనో తలదాచుకుంటున్నారు.  అయితే ఈ ప్రాంతాలకు అధికారులు ఇంత వరకూ రాలేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    పలు కాలనీల్లో తాగునీరు సైతం దొరక్క జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని లక్ష్మీబాగ్ కాలనీలో మోకాల్లోతు ప్రవాహం ఉంది. అధికారులు రెండు పూటలా భోజనం అందించారని, బయటకు వెళ్లి తాగునీరు తెచ్చుకోలేకపోతున్నామని స్థానికులు చెప్పారు. మల్లేపల్లి మాన్గార్ బస్తీ, అఫ్జల్  సాగర్ కాలనీలు ఇప్పటికీ  నీళ్లలోనే ఉన్నాయి. మెహదీపట్నం సర్కిల్ వ్యాప్తంగా కూలిన చెట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది.  అయితే టోలిచౌకీలోని శాతం చెరువు దగ్గర నదీం కాలనీ, విరాసత్ నగర్ తదితర ప్రాంతాల్లోని వందలాది ఇండ్లు మునిగిపోయాయి. అధికారులు బాధితులను పునరావస కేంద్రానికి తరలించారు.

    Also Read: రైతులకు కేంద్రం శుభవార్త.. సులభంగా లక్షా 60 వేల రుణం!

    గురువారం మూసీ నది పరివాహ ప్రాంతాలను కేంద్ర హోం శాఖ  సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అదుకుంటామని ఓదార్చారు.  అలాగే ఖైరతాబాద్ ఎం ఎస్ ముత్తాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ ,  శ్రావణ్ కుమార్ తదితరులు పర్యటించారు. బాధితుల గోడు తెలుసుకున్నారు.  బాధిత జనాలను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో  కలిసి మంత్రి కేటీఆర్ బీఆర్ కే  భవన్ లో వరదలు, వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.  పలు చోట్ల ఇంకా నీరు నిల్వ ఉన్న కాలనీల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, 104 వాహనాల ద్వారా వైద్య సాయం అందిస్తున్నట్లు చెప్పారు.   చెరువుల వద్ద ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  వరద పరిస్థితులపై పురపాలక శాఖ నివేదిక రూపొందించాలన్నారు.   కాగా, బుధ, గురు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 196 మందిని రక్షించినట్లు హైదరాబాద్ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి  వి.పాపయ్య తెలిపారు. ఇళ్లలో నీరు నిల్వ ఉంటే తొలగించేందుకు 101నంబర్కు గానీ, 9949991101 నంబర్ కు గానీ సమాచారం అందించాలని సూచించారు.