
హైదరాబాద్ మహానగరం. ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు.. ఇతర రాష్ట్రాలు.. దేశ విదేశాల వాళ్లకూ రోజురోజుకూ హాట్ ఫెవరేట్ అవుతోంది. విలేజ్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే.. రోజురోజుకూ సిటీకి డిమాండ్ పెరిగిపోతోంది. అదేసమయంలో ఇక్కడ ఇళ్ల ధరలూ మండిపోతున్నాయి. పోనీ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉందనుకుంటే అలా లేదు. హైదరాబాద్‌లోనే ధరలు పెరిగిపోతున్నాయి. మిగతా ఏ నగరాల్లోనూ ఈ పరిస్థితి లేదు.
గతేడాది చివరి త్రైమాసికంలో హైదరాబాద్ నగరంలోనే ఇళ్ల ధరలు పెరిగినట్లు కనిపించిందని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ అయిన నైట్‌ఫ్రాంక్ విడుదల చేసిన ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్- క్యూ4, 2020’ నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంతో పోల్చి చూస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 0.20 శాతం పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో బెంగుళూరు, ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ తదితర నగరాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. చెన్నైలో అధికంగా ఇళ్ల ధరలు 9 శాతం తగ్గినట్లు ఈ నివేదిక వివరించింది.
ఇక గతేడాది అక్టోబరు–డిసెంబర్ మధ్య కాలంలో, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలతో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 127 శాతం పెరిగాయి. అక్టోబరు–-డిసెంబరు మధ్యకాలంలో మొత్తం 3,651 యూనిట్ల(అపార్ట్మెంట్లు, సొంత ఇళ్లు) అమ్మకాలు నమోదు కాగా, అంతకుముందు మూడు నెలల కాలంలో 1,609 ఇళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. కోవిడ్-19 మహమ్మారి ముంచుకొచ్చినా హైదరాబాద్‌లో ఇళ్ల ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ధరలు అలానే స్థిరంగా ఉండిపోయినట్లు నైట్‌ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బజాజ్ వివరించారు. గతేడాది మొత్తంగా చూస్తే ధరలు ఏ నెలకా నెలా పెరుగుతూ వచ్చాయే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలు లేవు. ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ఫలితంగా ఉద్యోగావకాశాలు పెరిగి, హైదరాబాద్‌లో ఇళ్లకు గిరాకీ కొనసాగుతున్నట్లు విశ్లేషించారు.
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం చూస్తే.. ప్రపంచ వ్యాప్త నగరాల్లో గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధికంగా టర్కీ రాజధాని అంకారాలో ఇళ్ల ధరలు 30 శాతం పెరిగాయి. ఆ తర్వాత స్థానాల్లో టర్కీకే చెందిన ఇజ్మిర్, ఇస్తాంబుల్ నగరాలు ఉన్నాయి. ఒక మాదిరిగా ధరల పెరుగుదల న్యూజిలాండ్‌లో కనిపించింది. న్యూజిలాండ్‌లోని అక్ల్యాండ్, వెల్లింగ్టన్ నగరాల్లో 26.4%, 18.4% పెరిగాయి. కెనడాలోని హెలిఫ్యాక్స్ నగరంలో ఇళ్ల ధరల పెరుగుదల 16.3% ఉంది.
మహానగరమైన మన హైదరాబాద్ విశ్వవ్యాప్త నగరంగా ఖ్యాతి సాధిస్తోంది. ఏటా ఎన్నో సర్వేలు, ర్యాంకింగ్స్‌లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్.. ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇప్పటికే సేఫియెస్ట్ జాబితాలోనూ చేరింది. 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నంబర్ 1గా నిలిచింది. అందుకే.. దేశంలో మరెన్నో గొప్ప నగరాలు ఉన్నా.. వాటికి లేని డిమాండ్ హైదరాబాద్‌కు పెరుగుతోంది. భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, సుస్థిరాభివృద్ధి కలిగిన, స్థిరమైన ఉపాధి కల్పించే నగరంగా అగ్ర స్థానంలో నిలిచిందంటే హైదరాబాద్ గురించి అర్థం చేసుకోవచ్చు. అటు ఉపాధి.. ఇటు ఉద్యోగ పరంగా అందరినీ అక్కున చేర్చుకుంటుండడంతో హైదరాబాద్‌లో సెటిల్ అయ్యేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అందులోభాగంగా ఇక్కడి ఇళ్లకూ ఈ స్థాయి డిమాండ్ ఏర్పడుతున్నట్లుగా అర్థమవుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్