YCP Politics : 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ, నవ్యాంధ్ర రాష్ట్రాలుగా ఏర్పాటు చేసినప్పుడు.. హైదరాబాద్ మహానగరాన్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. అప్పట్లో ఉన్న సెక్రటేరియట్, ఇంకా కొన్ని భవనాలను ఏపీకి కేటాయించారు. ఈలోగా ఓటుకు నోటు వివాదం రావడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏపీకి వెళ్లిపోయారు. అక్కడ తాత్కాలికంగా సెక్రటేరియట్ నిర్మించారు. అమరావతి ప్రాంతాన్ని ఏపీకి రాజధానిగా ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు అమరావతి నిర్మాణ విషయంలో తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈలోగా టిడిపికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తడంతో ఒక్కసారిగా అమరావతి నిర్మాణం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కొంతకాలానికి అమరావతి పై జగన్ చిన్నచూపు చూశారు. ఏపీకి “మూడు రాజధానులు” అనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ ఇలా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. తాను త్వరలో విశాఖపట్నం వెళ్ళిపోతున్నానని.. రిషి కొండపై నిర్మించిన భవనాన్ని తన అధికారిక కార్యాలయంగా ఉపయోగించుకుంటానని జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులు కొత్త పాట పాడుతున్నారు.
ఏపీకి రాజధాని లేనందున హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు వై వి సుబ్బారెడ్డి ఇదే విషయంపై మాట్లాడటం ఎప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వాస్తవానికి హైదరాబాదులో భవనాల కొరత లేకపోయినప్పటికీ.. అప్పట్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును ప్రకటించినప్పుడు గత సెక్రటేరియట్ భవనాలను ఏపీకి కేటాయించారు. కోవిడ్ సమయంలో ఆ భవనాలను కెసిఆర్ కూల్చేశారు. ఆ స్థానంలో కొత్త సెక్రటేరియట్ నిర్మించారు. ఇప్పుడు వైసీపీ డిమాండ్ చేస్తే హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయడానికి అక్కడి ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు. పైగా వైవి సుబ్బారెడ్డి హైదరాబాదు రాజధానిపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. పెట్టి పరిస్థితిలో హైదరాబాద్ మహా నగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
వాస్తవానికి అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి పదేపదే అదే విషయాన్ని పలు సభల్లో ప్రస్తావించారు. అందుకే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చామని అన్నారు. కానీ ఆయన చెప్పినట్టుగా మూడు రాజధాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అది కూడా విశాఖపట్నం లాంటి మహానగరంలో రిషికొండను తొలచి ఆయన భవనం కట్టుకున్నారు. అక్కడికి కూడా త్వరలో వెళ్తానని పలుమార్లు ప్రకటించారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళలేదు. పైగా తన పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తో హైదరాబాదులో ఉమ్మడి రాజధానిగా చేయాలని డిమాండ్ చేయించారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పక్క రాష్ట్ర నాయకులు అని సంబోధించేవారు. అలాంటప్పుడు ఇప్పుడు వై వి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించే వరకు హైదరాబాద్ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని డిమాండ్ చేయించడం ఎంతవరకు సమంజసం? గత పది సంవత్సరాలలో రాజధాని కూడా కట్టించుకోవాలని దుస్థితి తమది అని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నారా?
పదేపదే విశ్వసనీయత అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణంలో దానిని ఎందుకు చూపించలేకపోతున్నారు? ఒకవేళ హైదరాబాద్ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఫాయిదా ఏముంది? ఒకవేళ జగన్ మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు అనుకుంటే హైదరాబాద్ ప్రాంత ఓటర్లు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చెందుతారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ అంత బలంగా లేదు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ వాదన ఎత్తుకున్నారు? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని డిమాండ్ ఎన్నికల ముందు వైసిపి చేసుకుంటున్న సెల్ఫ్ గోల్. అంతే అంతకుమించి ఏమీ లేదు. వినాశాకాలే విపరీత బుద్ధి అన్నట్టు.. కనీసం ఐదు సంవత్సరాలలో రాజధాని విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయని జగన్మోహన్ రెడ్డి.. మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం.. కనీసం వాటి అభివృద్ధికి చొరవ కూడా చూపకపోవడం అత్యంత బాధాకరం.. మరి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని డిమాండ్ ను ఎన్నికల ముందు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి.