Huzurabad By Elections:హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న టీఆర్ఎస్ అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకుంది. దేశంలో జాతీయ పార్టీలు, బద్ద శత్రువులైన కాంగ్రెస్, బీజేపీలు హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం లాలూచీపడ్డ వైనాన్ని స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బయటపెట్టి సంచలనం సృష్టించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు టైం దగ్గరపడుతున్న వేళ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో లాగానే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లు టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఒక రహస్య ఎజెండాతో ముందుకెళుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రహస్యంగా భేటి అయ్యారని బాంబుపేల్చారు. గోల్కొండ కోటలో వీరిద్దరూ రహస్య మంతనాలు జరిపారని..దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కేటీఆర్ సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈటల రాజేందర్ బీజేపీ-కాంగ్రెస్ ల ఉమ్మడి అభ్యర్థి అని కేటీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో రెండు జాతీయ పార్టీల అభ్యర్థితో టీఆర్ఎస్ పోటీపడుతోందన్నారు.ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఈటల గెలుపు వారికి ముఖ్యం కాదని.. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా సాగుతున్నారన్నారు. ఏడాది తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరే ఒప్పందం చేసుకున్నారన్నారు. గోల్కొండ రిసార్ట్ లో ఈటల, రేవంత్ రెడ్డి కలిశారని తెలిపారు. మా దగ్గర ఫొటోలు, ఇతర ఆధారాలు కూడా ఉన్నాయని కేటీఆర్ సంచలన విషయాలను పంచుకున్నారు.
నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లోనే ఉత్తర తెలంగాణలో బీజేపీ, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లు చేసుకొని ఓట్లు బదిలీ చేసుకున్నాయని కేటీఆర్ తెలిపారు. అందుకే హుజూరాబాద్ లోనూ కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపిందని ఆరోపించారు. ఈటలకు అనుకూలంగా రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారన్నారు.
ఈటల తప్పు చేయకపోతే సీఎం కేసీఆర్ ను కలిసి వివరణ ఇచ్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. ఈటల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.