Huzurabad bypoll: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ప్రచారం జోరందకుంటోంది. ఇదే ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలకు అగ్నిపరీక్షలా మారింది. ‘పనున్న దినం. పన్జేసుకోనియ్యకుండా ఊకూకే ప్రచారానికొస్తుండ్రు’ అని ప్రజలు కసురుకుంటున్నారు. అయినా నాయకులు వినడం లేదు. మా పంతం మాది అనుకుంటూ మీ ఓటు మాకే అని అభ్యర్థిస్తున్నారు. వరికోతల సమయం కావడంతో తీరిక లేకుండా కళ్లాల్లో ధాన్యం ఆరబోస్తున్నారు. ఇంటికి తాళంపెట్టి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినా అక్కడికీ నాయకులు చేరుకుని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఒక్కరా.. ఇద్దరా.. మూడు ప్రధాన పార్టీల నాయకులు ఒక్కో మండలం, ఒక్కో గ్రామం చొప్పున ఓటర్లను లెక్కలేసుకుని మరీ ప్రచారానికి వస్తున్నారు. ఒక్కో దిక్కుకు ఒకే పార్టీలోని నాయకులు పయనమై ప్రజల మొస మర్రనీయకుండా ప్రచారం నిర్వహిస్తుండటంతో ప్రజలు ఈసడించుకుంటున్నారు. వచ్చిన వాళ్లు కొత్తగా చెప్పేదేమీ ఉండదు. కొన్ని నెలలుగా అవే మాటలు చెబుతుండటంతో ప్రచారం బోర్ కొట్టేసింది. ముఖం మీదనే తలుపులేసిన ఇంటివెనుక నుంచి వచ్చి మరీ ఓట్లను అభ్యర్థిస్తున్నారంటే అక్కడి ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పోలింగ్ దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష నాయకులు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారు. దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఒక్కో గ్రామంలో ఒకే పార్టీకి చెందిన నాయకులు నాలుగైదు గ్రూపులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా మరీ మరీ వచ్చి కలుస్తున్నారు. అంటే ఈ లెక్కన ప్రతి ఓటరును కనీసం నలుగురైదుగురైనా కలుస్తున్నారు. ఇదే స్థానికంగా ప్రజలకు చికాకు తెప్పిస్తోంది. అందులోనూ ప్రచారానికి వచ్చే నాయకులు వారి పైనున్న ఇన్‌చార్జులకు డెయిలీ రిపోర్ట్ చేయాల్సి ఉన్నందున ప్రజలతో ఫొటోలు దిగడం సర్వసాధారణమైంది. ఫోటోలను ఫోజులివ్వటం, ఫోటోల కోసం ఓటర్లను అటీటు తిప్పటం కూడా వారి అసహనానికి కారణమవుతోంది.
ఇలా పొద్దున లేచిన నుంచి నాయకులు తమ చుట్టే తిరుగుతుండటంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. మరోవైపు ఆటోమేటెడ్ వాయిస్ కాల్స్, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ మేస్సేజీలు, నార్మల్ మెస్సేజీలు ఇలా ఒక్కటేమిటి? ఓట్ల కోసం ప్రజల ప్రైవసీ దూరం చేస్తున్నారు. ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లతో విసిగిపోయిన జనం స్విచ్ఛాప్ కూడా చేసి పెడుతున్నారు. మరికొందరు పదే పదే ఓటును అభ్యర్థించే ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారు. ఇలా ఎక్కడా జరగని హుజూరాబాద్‌లో జరుగుతుండటం విశేషం. మరో రెండు రోజులు ప్రచారం పరిసమాప్తం కానుంది. దీంతో ప్రజలు కాస్తా ఊపిరి తీసుకునే వెసలుబాటు రానుంది.