Poll Management: హుజూరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా ముగియవస్తోంది. ఏ పార్టీ గెలుస్తుందో, ఏ అభ్యర్థికి అవకాశం ఇస్తారో అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఓటరు నాడి మాత్రం ఏ పార్టీకి అర్థం కావడం లేదు. ఎవరికి వారు తాము గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకున్న సమయంలో అభ్యర్థుల గెలుపోటములు ఇప్పుడు పోల్ మేనేజ్మెం ట్ చేతిలో ఉన్నాయి. ఈ పోల్ మేనేజేమెంట్ ఎవరు ఎంత చక్కగా నిర్వహిస్తారో వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. గతంలో జరిగిన ఎన్నికలు ఈ విషయానికి ఊతం ఇస్తున్నాయి.

మూడు పార్టీల అభ్యర్థులు… పోటీ ఇద్దరి మధ్యే..
హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి యువజన కాంగ్రెస్ నాయకుడు బాల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం రెండు పార్టీల మధ్య అంటే బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు చీల్చడంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఇది ఎవరికి కలిసి వస్తుందోనన్న విషయం ప్రస్తుతానికైతే సుస్పష్టం.
రెండు పార్టీలకు ఈ ఎన్నిక ఛాలెంజే..
ఇది కేవలం ఒక ఉప ఎన్నిక మాత్రమే కాదు. దీనిని బీజేపీ, టీఆర్ ఎస్ ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఈటల రాజేందర్ ఒక్క సారిగా అవినీతి ఆరోపణలు రావడం, సీఎం కేసీఆర్ దీనిని సీరియస్ గా తీసుకోవడం, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈటలపై సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా కోపంగా ఉన్నారని, అందుకే ఆయన ఇంత వరకు తీసుకొచ్చారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఇలా అవినీతి ఆరోపణలు వచ్చిన నాయకులపై ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం, కేవలం ఈటల రాజేందర్ విషయంలోనే ఇలా జరగడం పట్ల ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే తరువాత జరిగిన పరిమాణాల వల్ల ఈటల బీజేపీలోకి చేరి, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అందుకే బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో గెలిస్తే తాము రాష్ట్రంలో బలపడే అవకాశం ఉందని, టీఆర్ఎస్ పై అంసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులు తమవైపు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం సులభం అవుతుందని అనుకుంటోంది. అందుకే టీఆర్ ఎస్ కూడా ఈ స్థానాన్ని కోల్పోవడానికి ఇష్టపడటం లేదు. ఇక్కడ ఓడిపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు తామే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని భావిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు ఈ రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యలా తయారయ్యింది.
ఈ రోజులే చాలా ముఖ్యమైనవి..
ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే టీఆర్ ఎస్ అక్కడ ప్రచారం వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా కావాల్సిన అన్ని పనులను వేగవంతం చేసింది. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టింది. అలాగే బీజేపీ కూడా మొదటి నుంచి ప్రచారంలో దూసుకుపోతోంది. కుల సంఘాలతో, యువజన సంఘాలతో మీటింగ్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు మొదటి నుంచి డబ్బులు, బహుమతుల రూపంలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాయి. అయితే ఇన్ని రోజుల ప్రచారం ఒక లెక్క.. ఇప్పుడు చేసే పోల్ మేనేజ్‌మెంట్ ఒక లెక్క. ఈ రోజులే విజయాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. రాత్రికి రాత్రే ఓటర్ల మనసు మార్చే ఛాన్స్ ఈ పోల్ మేనేజ్ మెంట్‌కు ఉంది. ఇవి గతంలో జరిగిన చాలా ఎన్నికల్లో రుజువు అయ్యాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ఏమైనా చేసే అవకాశం ఉంది.