Huzurabad By Poll: తెలంగాణలో పవర్ ఫుల్ గా ఉన్న సీఎం కేసీఆర్ తో పెట్టుకొని మంత్రి పదవిని చీకొట్టి బయటకొచ్చి సవాల్ చేసిన ఈటల రాజేందర్ ను ఓడించడానికి గులాబీ దళం ఎంత చేయాలో అంతా చేసింది. నామినేషన్ల నుంచి నేటి ఎన్నికల ముందు వరకూ పథకాలు, పనులు, అభివృద్ధి, ఓటుకు రూ.10వేల వరకూ అంతా పంచేశారు. కానీ చివరి మూడు రోజుల్లో ఏం జరిగింది? ఈటల రాజేందర్ లో ఇప్పుడు ఎందుకింత భయం ఆవహించిందన్నది అంతుబట్టని వ్యవహారంగా మారింది.
ఎన్నికల కమిషన్ సూచనల మేరకు కరోనా కారణంగా మూడు రోజుల ముందే హుజూరాబాద్లో ప్రచారం ఆపేశారు.మొత్తం కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. ఆయినా కూడా హుజూరాబాద్ లో డబ్బు, మద్యం ఏరులైపారింది. ఒక్క ఓటుకు రూ.10వేల వరకూ పంచారన్న నిజం బయటపడింది.
తాజాగా కమలాపూర్ లో ఓటేసిన ఈటల రాజేందర్ పలు సంచలన ఆరోపణలు చేశారు. అధికార దుర్వినియోగంతో పోలీసులతో డబ్బులు పంచారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని.. ప్రజలు ధర్మం న్యాయం వైపు ఉన్నారన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వొద్దని కేసీఆర్ చివరి మూడు రోజుల్లో అతిపెద్ద కుట్ర చేశాడని ఆరోపించారు.
హుజూరాబాద్ పోలింగ్ కు ముందు మూడు రోజుల్లోనే ప్రలోభాలతో ఇక్కడ అంతా మార్చేశారని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంత నీచంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోనే సీన్ అంతా మారిపోయిందన్న ఈటల వ్యాఖ్యలతో అక్కడ ఈటల ఓడిపోతున్నారా? అంతగా టీఆర్ఎస్ డబ్బులు, మద్యం పంచేసిందా? ఓటర్లను కొనేసిందా? అన్న చర్చసాగుతోంది. మరి ఫలితాలు రోజు ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.