Huzurabad By Poll: సంకుల సమరంలో విజేతలు ఎవరన్నది నేడు తేలిపోనుంది. అనూహ్య పరిస్థితుల్లో గెంటివేతకు గురైన ఈటల రాజేందర్ పట్టుదలతో పోరాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజేతలు ఎవరన్నది తేలిపోనుంది. నేడు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ అంతటా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు గురిచేసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పంతం నెగ్గుతోందా? ఈటల రాజేందర్ పట్టుదల నిలుస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడిన ఈ ఎన్నికలను టీఆర్ఎస్ దళం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నమ్మకంగా ఉన్నా తనను గెంటేసిన కేసీఆర్ పై ప్రతీకారంతో ఈటల రాజేందర్ చివరికంటా పోరాడారు. ఇక ఎన్నడూ లేనంత స్థాయిలో 86.64శాతం రికార్డ్ పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈరోజు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ వేదికగా వెలువడే ఫలితాలు ఎవరికి షాకిస్తాయన్నది వేచిచూడాలి.
మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 753 పోస్టల్ ఓట్లు నమోదు కాగా మొదటి అరగంట పాటు వాటిని లెక్కించనున్నారు. అనంతరం జరిగే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఉప ఎన్నికల కౌంటింగ్ 22 రౌండ్లలో వెలువడనుంది. ఒక్కో రౌండ్ కు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడం వల్ల తుది ఫలితం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు పోటీచేశాయి. ఇందులో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే హోరాహోరీగా సాగింది. సెంటిమెంట్,లోకల్ కార్డుతో ఈటల ప్రజల్లోకి వెళ్లగా.. టీఆర్ఎస్ దళితబంధు, పథకాలు, పనులు, కేసీఆర్ ఇమేజ్ తో ముందుకు సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి కొత్త వాడు, స్థానికేతరుడు కావడంతో అంతగా బలం చూపించలేకపోయాడు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈటల గెలుస్తాడని చెప్పాయి. కానీ టీఆర్ఎస్ లో మాత్రం ఆశ చావడం లేదు. ఏం జరుగుతుందనేది ఈరోజు తేలనుంది.