Bandi Sanjay: సీఎం నువ్వే.. 20 ఏళ్లుగా అధ్యక్షుడివీ నువ్వేనా కేసీఆర్?

-వర్కింగ్, కూతురు సిట్టింగ్, అల్లుడు స్టాండింగ్, మరదలి కొడుకు స్లీపింగ్ ప్రెసిడెంట్లుగా పార్టీని ఏలుతారా? -హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి ఖాయమనే ప్లీనరీ పేరిట సీనరీ క్రియేట్ చేసేందుకు టీఆర్ఎస్ యత్నం -దుబాయిలో బతుకమ్మ ఆడుతూ కేసీఆర్ ఫోటో పెట్టడం సిగ్గుచేటు -పోడుభూములపై కేసీఆర్ కొత్త డ్రామాలాడుతున్నరు -పోడు రైతులపై లాఠీలతో కొట్టి బాలింతలని కూడా చూడకుండా మహిళలను జైళ్లకు పంపిన నీచుడు కేసీఆర్ -ఇల్లందకుంట మండలం రాచపల్లి, టేకుర్తి గ్రామాల ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, […]

Written By: NARESH, Updated On : October 24, 2021 7:24 pm
Follow us on

-వర్కింగ్, కూతురు సిట్టింగ్, అల్లుడు స్టాండింగ్, మరదలి కొడుకు స్లీపింగ్ ప్రెసిడెంట్లుగా పార్టీని ఏలుతారా?
-హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి ఖాయమనే ప్లీనరీ పేరిట సీనరీ క్రియేట్ చేసేందుకు టీఆర్ఎస్ యత్నం
-దుబాయిలో బతుకమ్మ ఆడుతూ కేసీఆర్ ఫోటో పెట్టడం సిగ్గుచేటు
-పోడుభూములపై కేసీఆర్ కొత్త డ్రామాలాడుతున్నరు
-పోడు రైతులపై లాఠీలతో కొట్టి బాలింతలని కూడా చూడకుండా మహిళలను జైళ్లకు పంపిన నీచుడు కేసీఆర్
-ఇల్లందకుంట మండలం రాచపల్లి, టేకుర్తి గ్రామాల ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్

bandi sanjay

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలుపేల్చారు. సీఎం కేసీఆర్ ను చీల్చిచెండాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘టీఆర్ఎస్ లో దళితులెవరూ అధ్యక్ష పదవికి అర్హులు కారా? కేసీఆరే సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉంటారా?’’ అని బండి సంజయ్ విమర్శించారు. పార్టీ పెట్టినప్పటి నుండి 20 ఏళ్లుగా కేసీఆరే అధ్యక్షుడిగా ఉంటారా? రేపు కూడా మళ్లా ఆయనే కొనసాగుతారా? ఇదేం విడ్డూరం అని మండిపడ్డారు.

కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, కూతురు సిట్టింగ్ ప్రెసిడెంట్, అల్లుడు స్టాండింగ్ ప్రెసిడెంట్, మరదలి కొడుకు సంతోష్ రావు స్లీపింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ పార్టీని ఏలుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్… ఇన్నాళ్లూ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసినవ్. ఉప ముఖ్యమంత్రి ఇస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని, దళిత బంధు ఇస్తానని మోసం చేసినవ్. కనీసం రేపటి ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్ష పదవినైనా దళితుడికి అప్పగించి చిత్తుశుద్ధి నిరూపించుకుంటావా?…నీకు ఆ దమ్ముందా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు.

దుబాయిలో బూర్జ్ ఖలీఫా వద్ద కల్వకుంట్ల కవిత కేసీఆర్ ఫోటో పెట్టి బతుకమ్మ ఆడటం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలాడుతున్నారని, బీజేపీ వల్లే దళితబంధు ఆగటిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు తన ముఖం చూసి ఓటేయాలని చెప్పిన కేసీఆర్ ఎన్నికల్లో ఆయన ముఖం చెల్లడం లేదన్నారు. అందుకే డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఈ ఎన్నికలను చిన్నవిగా చూపుతూ ప్లీనరీ పేరిట పెద్ద సీనరీ క్రియేట్ చేస్తున్నారని అన్నారు.

హుజూరాబాద్ గడ్డమీద కాషాయ జెండాను రెపరెపలాడించడం ఖాయమని బండి సంజయ్ విమర్శించారు. ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను తరిమితరిమి కొడతారని, డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం రాచపల్లి, టేకుర్తి గ్రామాల్లో ఆదివారం బండి సంజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జెనవాడె సంగప్ప, హుస్సేన్ నాయక్, తిరుపతిరెడ్డి, బెల్లం ఐలన్న, సమ్మిరెడ్డి, ఆరెళ్ల లింగయ్యగౌడ్ తదితరులు హాజరైన ఈ సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• దేశంలో కోవిడ్ వల్ల ప్రజలు బాధపడుతున్నరని తెలిసి ఉచితంగా 100 కోట్ల డోసులను ఉచితంగా అందించిన ఘనత నరేంద్రమోదీదే. ఈటల రాజేందర్ కొట్టిన దెబ్బకు కేసీఆర్ కు నిద్రపట్టడం లేదు. 30న జరిగే పోలింగ్ లో పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. నవంబర్ 2న ప్రగతి భవన్ ముందు ‘ట్రిపుల్ ఆర్’ (రాజాసింగ్, రఘునందన్, రాజేందర్) సినిమా కేసీఆర్ కు చూపిస్తం.
•ఓటుకు రూ.20 వేలు కేసీఆర్ పంపిండట. అందులో రూ.15 వేలు దాచుకుని రూ.5 వేలే టీఆర్ఎసోళ్లు ఓటర్లకు ఇస్తున్నరట. దొంగనోట్లు పంచుతున్నరట…జాగ్రత్తగా చూసుకోండి. రాచపల్లి, మల్లన్నపేట, టేకుర్తి గ్రామాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చింది. లెక్కలు చెబుతున్నా….తప్పయితే నాపై కేసు పెట్టాలని టీఆర్ఎస్ కు సవాల్ చేస్తున్న.
•రేషన్ బియ్యానికి డబ్బులు కేంద్రమే ఇస్తోంది. రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, మొక్కలు, వ్యాక్సిన్, మరుగుదొడ్లు సహా చివరకు స్మశాన వాటిక నిర్మాణానికి డబ్బులిస్తోంది కేంద్రమే. ఇంత పెద్ద ఎత్తున కేంద్రం డబ్బులిస్తే టీఆర్ఎస్ నేతలు మాత్రం తామే ఇస్తున్నట్లుగా సొంతంగా ప్రచారం చేస్తున్నరు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఈ ఎన్నికలను చిన్నవిగా చూపేందుకు టీఆర్ఎస్ నేతలు ప్లీనరీ పేరిట సీనరీ క్రియేట్ చేస్తున్నరు.
•టీఆర్ఎస్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 20 ఏళ్లుగా కేసీఆరే అధ్యక్షుడు. అదేం పార్టీ. ఈసారి కూడా ఆయనే మళ్లీ అధ్యక్షుడట. కొడుకుకు వర్కింగ్ ప్రెసిడెంట్, స్టాండింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు, కూతురు కవిత సిట్టింగ్ ప్రెసిడెంట్….ఇక స్లీపింగ్ ప్రెసిడెంట్ సంతోష్ రావు. దళితులకు సీఎం పదవి ఇస్తానని మోసం చేసిండు. దళిత బంధు ఇవ్వలేదు. దళితులకు ఉఫ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. కేసీఆర్… 20 ఏళ్లుగా నువ్వే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నావు కదా… సీఎంగా ఉన్నవ్ కదా… దళితులకు సీఎం పదవి ఇస్తానని మోసం చేసినవ్. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. మూడెకరాల భూమి ఇవ్వలేదు. దళిత బంధు ఇవ్వకుండా మోసం చేసినవ్.దళితులపై నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రేపటి ప్లీనరీలో దళితుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకో…..
•కవితమ్మ దుబాయ్ పోయి బూర్జ్ ఖలీఫా వద్దకు పోయి బతుకమ్మ ఆడింది. కేసీఆర్ ఫొటో పెట్టింది. బతుకమ్మ ఆడుతూ కేసీఆర్ ఫొటో పెడుతున్నరు. ఇదేం పద్దతి? మహిళలకు బతుకమ్మ ఆట తెలియదా? బతుకమ్మ అంటే గౌరమ్మా…కవిత మాత్రం చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ సహా ఏది పడితే అది పెట్టి బతుకమ్మ ఆడుతోంది.
•హుజూరాబాద్ లో ఓడిపోతున్నామని తెలిసి వీటిని చిన్న ఎన్నికలుగా చిత్రీకరిస్తున్నరు. టీఆర్ఎస్ ప్లీనరీగా సీనరీగా క్రియేట్ చేస్తూ ప్రజలను దారిమళ్లించే కుట్ర చేస్తున్నరు. నేనడుగుతున్నా…. దుబ్బాక, నాగార్జున సాగర్ ఎన్నికలు పెద్దవైతే…. మరి హుజూరాబాద్ ఎన్నికలు చిన్నవెట్లయితయ్?
•పోడు భూములకు పట్టాలిస్తానంటూ కేసీఆర్ మళ్లీ కొత్త డ్రామాలు మొదలుపెడ్తుండు. ఎన్నికలొచ్చినప్పుడల్లా మాయ మాటలు చెబుతూ ఉన్నడు. ఎన్నికలై పోయినంక పోడు రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర కేసీఆర్ ది. ఖమ్మంలో బాలింతలని కూడా చూడకుండా పోలీసులతో కొట్టించి జైలుకు పంపిన నీచుడు కేసీఆర్. పోడు భూములపై గుర్రంపోడులో పోరాడి జైలుకు వెళ్లిన చరిత్ర బీజేపిది.
•దళితులు, పేదల కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీ. పేదలు త్యాగాలు చేస్తే పెద్దలు రాజ్యమేలుతున్నరు. వరి వేస్తే ఉరే గతి అని సీఎం చేసిన వ్యాఖ్యలవల్ల 5 గురు రైతులు చనిపోయిండ్రు. నిన్ను సీఎం చేసింది రైతులను బెదిరించడానికా? రైతులు తమ పొలంలో ఏ పంట వేసుకోవాలో వాళ్ల ఇష్టం. రైతులు పండించిన పంటనంతా కొనిచ్చే బాధ్యత మేం తీసుకుంటం. కేసీఆర్ గల్ల పట్టి కొనిస్తం. అసలు కేసీఆర్ కు సంబంధమేలేదు. సుతిలీ తాడుసహా ధాన్యం కొనుగోలుకు డబ్బులన్నీ కేంద్రమే ఇస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి 2 శాతం కమీషన్ ఇస్తున్నం.
•ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ ఇంట్ల మాత్రం అందరికీ కొలువులొచ్చినయ్. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని శ్రీకాంత్ చారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ వంటి 1400 మంది బలిదానం చేసుకుంటే రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు ఉద్యమాల కోసం బలిదానాలు చేసుకుంటే…..నేడు ఉద్యోగాలు రాక అనేక మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. మురళి, సునీల్ నాయక్, నర్సయ్య వంటి యువకులు ఉద్యోగాలు రాక వర్శిటీల్లో ఆత్మహత్య చేసుకున్నరు. కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు చేసిన త్యాగలేమిటి?
•తెలంగాణ పేదలంతా బీజేపీకి ఓటేసి రాజేందర్ ను గెలిపించి కేసీఆర్ మెడలొంచాలని హుజూరాబాధ్ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నరు. ఈటల రాజేందర్ చేసిన పాపమేంటి? దళిత సమస్యలను ప్రశ్నిస్తే…ఉధ్యోగాలపై నిలదీస్తే బయటకు పంపిన మూర్ఖుడు కేసీఆర్. కోవిడ్ సమయంలో రాత్రింబవళ్లు తిరిగి కోవిడ్ పేషెంట్లను హత్తుకుని ప్రజలకు భరోసా ఇఛ్చిన నాయకుడు ఈటల రాజేందర్ అయితే ఫాంహౌజ్ లో కేసీఆర్ సకుటుంబ సమేతంగా జల్సాలు చేసింది.
•ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు జీతాలివ్వని హరీష్ రావు పెట్రోలు ధరల పెంపుపై దుష్ప్రచారం చేస్తుండు. ఉద్యోగులకు జీతాలివ్వడం చేతగాని హరీష్ రావు కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటు. టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులతోపాటు 108, 104 ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రాక రోడ్డున పడ్డరు.
•లీటర్ పెట్రోలుపై రూ.41లు టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుంది. ఆ సొమ్మును మినహాయిస్తే ప్రజలకు ఒక్క లీటర్ పెట్రోలు రూ.60కే అందుతుంది. టీఆర్ఎస్ కు చేతనైతే పెట్రోల్ పై పన్నును తగ్గించుకోవాలని సవాల్ చేస్తున్నా.
• టీఆర్ఎస్ నేతలను ధైర్యంగా ఎదుర్కొండి. మీకు అండగా బీజేపీ ఉంటుంది. బీజేపీ, బండి సంజయ్ అంటేనే కేసీఆర్ కు భయం పట్టుకుంది. నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉంటూ ఆదుకునేది ఈటల రాజేందర్ మాత్రమే. రాజేందర్ కు టీఆర్ఎస్ అన్యాయం చేసిందని ప్రజలంతా గుర్తించారు. వార్ వన్ సైడే. హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండాపై రెపరెపలాడటం ఖాయం. టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు. చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం అంటూ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పై సంచలన విమర్శలతో హోరెత్తించారు. హుజూరాబాద్ ఓటర్లను ఆకట్టుకున్నారు.