https://oktelugu.com/

Politics Lookback 2024: 2024 రౌండప్ : బీఆర్ఎస్ కు కలిసిరాని కాలం

2024 మే 13న 18 వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. బీ ఆర్ ఎస్ రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోటీ చేసింది. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. కాని ఒక్క సీటునూ కూడా గెలుచుకోలేక పోయింది‌.

Written By: , Updated On : December 27, 2024 / 03:37 PM IST
Politics Lookback 2024(3)

Politics Lookback 2024(3)

Follow us on

BRS Party: కాల చక్రం గిర్రున తీరిగింది. మరి కొద్దిరోజుల్లో 2024 కూడా కాల గర్భంలో కలిసిపోనుంది. ఈ ఏడాది రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం ఆది నుంచి భారతీయ రాష్ట్ర సమితీకి చేదు అనుభవాలే మిగిలాయి. గత ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకున్న ఆ పార్టీకి కొత్త సంవత్సరం సైతం కలిసి రాలేదు. ఓ వైపు రాష్ట్రంలో ప్రతిపక్షానికి పరిమితం కావడం..ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా చేజారుతుండడం.. అధికార పార్టీ ఆకర్ష్ కు ఎక్కువమంది ఆకర్షితులు కావడం.. ఈ సమయంలోనే ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కవిత మార్చి 15న జైలు పాలవడం విదితమే. ఐదు నెలల పాటు ఆమె జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈ ఘటనలన్నీ ఆ పార్టీ అధినేతను తీవ్ర వేదనకు గురి చేశాయి.. ఓ వైపు కాంగ్రెస్ సర్కారు గత బీఆర్ ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణల పేరిట కమిటీలు, కమిషన్లు వేస్తుండడంతో వాటికి కౌంటర్ ఇచ్చుకోవడంతోనే ఎక్కువ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వేసవిలో వచ్చిన లోక్ సభ ఎన్నికలు గులాబీ బాస్ ను మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి.

*లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమి..
2024 మే 13న 18 వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. బీ ఆర్ ఎస్ రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోటీ చేసింది. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. కాని ఒక్క సీటునూ కూడా గెలుచుకోలేక పోయింది‌. రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్లో రెండో స్థానం పొంది..14 సీట్లలో మూడో స్థానంలో నిలవడం .. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమైంది. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ (నాటి టీ ఆర్ ఎస్)ఆవిర్భావం తర్వాత తొలి సారిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోయింది‌.

*కేటీఆర్ అరెస్టు అంటూ..
పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ బాస్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో అధికార పార్టీ రామారావును టార్గెట్ చేస్తూ త్వరలోనే అరెస్టవడం ఖాయమంటూ .. స్వయంగా రెవెన్యూ మంత్రితో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేయడం విదితమే. వీటికి కేటీఆర్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూ దేనికైనా రెడీ.. జైలుకైనా వెళతాం.. మిమ్మల్ని మాత్రం వదలం.. మీరిచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెంటాడుతూనే ఉంటాం.. అంటూ పేర్కొనడం గమనార్హం. పదేళ్ల పాటు రాష్ట్రంలో చక్రం తిప్పి కేంద్రంలోనూ సత్తా చాటిన ఆ పార్టీకి ఈ ఏడాది కొంత నిరాశను మిగిల్చిందని చెప్పవచ్చు. రానున్న నూతన సంవత్సరమైనా గులాబీ పార్టీకి కలిసి వస్తోందో లేదో వేచి చూడాల్సిందే.