
Huzurabad, Badvel Elections: హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల్లో రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోగా ఇక్కడ మాత్రం ప్రభుత్వంపై భారీ స్థాయిలో ప్రజాగ్రహం కనిపించడం గమనార్హం. ఏపీలో వైసీపీకి తిరుగులేదని నిరూపించింది. మరోసారి వైసీపీకి జనం హారతి పట్టారు. అక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలే ఆ పార్టీకి నీడలా నిలుస్తున్నాయి. ఇక్కడ మాత్రం అధికార పార్టీ అక్రమాలే ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది.
హుజురాబాద్ లో అధికార పార్టీ అక్రమాలకు అంతేలేకుండా పోయింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా వేలాది కోట్లు పంచినట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా ఓటర్లు మాకు డబ్బులు రాలేదని ఎదురుతిరిగిన సంఘటనలు కనిపించలేదు. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లు మాకు డబ్బులు అందలేదని రోడ్డెక్కడం సంచలనం అయింది. దీంతో అధికార పార్టీ పరువు కాస్త గంగలో కలిసింది. టీఆర్ఎస్ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలతోనే అక్కడ అది కిందికి దిగజారిపోయింది.
ఇక బద్వేల్ లో చూస్తే వైసీపీ సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురేష్ పై 90 వేల భారీ మెజార్టీ సాధించడం చూస్తుంటే అక్కడ వైసీపీకి ఎదురులేదని అనిపిస్తోంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి టీడీపీ, జనసేన తమ పరువు నిలబెట్టుకున్నాయి. కానీ బీజేపీ మాత్రం తాను పోటీలో నిలిచి తానే ప్రత్యామ్నాయం అని చెప్పి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అయింది. దీంతో వైసీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలని చెబుతుంటారు. ఇక్కడ పోటీలో నిలిచి తమ ప్రతిష్ట దిగజార్చుకున్నారే కానీ పరువు మాత్రం కాపాడుకోలేకపోయారు. దీంతో ఎప్పుడైనా మనం ఒక చాలెంజ్ వేస్తే దానికి అనుగుణంగా పోటీ ఇవ్వాలి. లేదంటే తప్పుకోవాలి. అంతేకాని పోటీలో నిలబడి పరువు పోగొట్టుకుని తల దించుకోకూడదు. ఇక్కడ బీజేపీ చేసింది ఇదే.