Huzurabad Badvel By Election: తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టించిన హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడబోతోంది. ఈ ఉప ఎన్నికల వేడి ఈరోజుతో క్లైమాక్స్ కు చేరనుంది. ఇక నేటితో ప్రచారానికి తెరపడనుంది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ లో ప్రచారానికి నేడే ఆఖరు రోజు. 48 గంటల ముందే కరోనా కారణంగా ఈసీ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈనెల 30న పోలింగ్ జరుగనుంది..
హుజూరాబాద్ లో బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతివ్వగా.. బద్వేలులో మాత్రం సాయంత్రం 7 గంటల వరకూ ప్రచారం చేసుకోవడానికి ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నాయకులు మాటల తూటాలతో రాజకీయాలను చివరి రోజు వేడెక్కించారు.
ఇక ఈరోజు సాయంత్రం ప్రచారం పర్వం ముగియగానే ప్రలోభాల పర్వం మొదలు కానుంది. పార్టీలన్నీ ఓటర్లకు ఓటుకు నోటు, మద్యం, విందులు, ఇతర గిఫ్ట్ లు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేశారు. భారీగా పంచేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఓటర్లు పండుగ చేసుకోనున్నారు.
-హుజూరాబాద్ లో టఫ్ ఫైట్
టీఆర్ఎస్ మంత్రిగా ఉండి రాజీనామా చేసి బీజేపీలో చేరి కేసీఆర్ ఢీకొంటున్న ఈటల రాజేందర్ ఇప్పుడు హుజూరాబాద్ లో టఫ్ ఫైట్ ను ఎదుర్కొంటున్నారు. అధికార టీఆర్ఎస్ ఇక్కడ సామధాన బేధ దండోపాయాలు ఉపయోగిస్తూ గెలుచుకోవడానికి నానా ఎత్తులు వేస్తోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్ పై నజర్ పెట్టి పథకాలు, పనులు సహా అన్ని చేసింది. గెలుపు కోసం పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. ఇక బీజేపీ తరుఫున ఈటల , బండి సంజయ్, ధర్మపురి అరవింద్, విజయశాంతి తదితరులు ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 30న జరిగే ఎన్నికల్లో ఎవరో గెలుస్తారో తెలియదు కానీ.. ఈరోజు చివరి రోజున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
-బద్వేలులో వైసీపీ వర్సెస్ బీజేపీ
బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన వైదొలగడంతో పోరు చప్పగా మారింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రచార పర్వంలో అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాటల తూటాలతో వేడెక్కిస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయం కాగా.. బీజేపీ ఎంత ప్రభావంచూపిస్తుందనేది వేచిచూడాలి. బీజేపీ తరుఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పురంధేశ్వరి, తదితరులు ప్రచారం చేస్తున్నారు. జనసేనాని పవన్ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రచారానికి రాలేదు.
మొత్తంగా ఈరోజుతో ముగిసే ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని రెండు నియోజకవర్గాల్లో హోరెత్తిస్తున్నారు. ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది.